● రోడ్డు ప్రమాదంలో అన్న మృతి
● పెళ్లికుమార్తెకు తీవ్ర గాయాలు
వేంపల్లె : చెల్లెలి పెళ్లి పిలుపుల కోసం వెళ్లిన ఆ అన్న తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. మరో మూడు రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన పెళ్లికూతురు ఆసుపత్రి పాలైంది. వివాహ వేడుకతో కళకళలాడాల్సిన ఆ ఇంట్లో రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. వివరాలు.. మండలంలోని కత్తులూరు గ్రామానికి చెందిన లక్కిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి (30) వేంపల్లెలో వాహనాలు పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు. పులివెందుల మండలంలోని ఎర్రిపల్లెలో నివాసముంటున్న తన చిన్నమ్మ కూతురు లక్ష్మీఅనిత వివాహం నవంబర్ 1న ఉండడంతో పెళ్లి పిలుపులకు బంధువులను పిలిచేందుకు పెళ్లి కుమారై వేంపల్లెకు వచ్చింది. బుధవారం బంధువులను పెళ్లికి పిలిచేందుకు లక్కిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వేంపల్లె నుంచి అయ్యవారిపల్లెకు బైకులో పెళ్లి కూతురు, తన చెల్లిని వెంట పెట్టుకొని వెళ్లాడు. అక్కడ పెళ్లి పిలుపులు ముగించుకుని ముగ్గురూ తిరిగి వస్తుండగా, పాములూరు – అయ్యవారిపల్లె మధ్యలో వీరు ప్రయాణిస్తున్న బైక్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న చంద్రశేఖర్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. పెళ్లి కుమార్తె లక్ష్మీ అనితకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే వేంపల్లె ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆమెను కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చంద్రశేఖరరెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వేంపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు వేంపల్లె పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


