చీనీ కాయల వ్యాపారిపై కేసు నమోదు | - | Sakshi
Sakshi News home page

చీనీ కాయల వ్యాపారిపై కేసు నమోదు

Oct 10 2026 1:28 AM | Updated on Oct 10 2026 1:28 AM

సంజామల: నొస్సం గ్రామానికి చెందిన నలుగురి రైతులను మోసం చేసిన ఓ చీనీ కాయల వ్యాపారిపై కేసు నమోదైంది. ఎస్‌ఐ రమణయ్య తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన మహేంద్ర, గాధంశెట్టి రాఘవ, గాధంశెట్టి లక్ష్మీనారాయణ, ఓబులేసుకు చీని తోటలు ఉన్నాయి. వీరి వద్ద నుంచి రూ.2.18 లక్షలు విలువగల చీనికాయలను వైఎస్సార్‌ కడప జిల్లా తొండూరు మండలం మల్లాల గ్రామానికి చెందిన భూచిపాటి రామాంజనేయులు జూలై 19వ తేదీన కొనుగోలు చేశాడు. అయితే డబ్బులు కొద్దిరోజులు తర్వాత ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నారు. గడువు ముగిసినా తర్వాత రైతులు డబ్బులు అడుగుతున్నా పట్టించుకోకపోవడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు వ్యాపారి రామాంజనేయులపై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

ఎస్‌జీఎఫ్‌ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక

కమలాపురం: పట్టణంలోని జడ్పీ బాయ్స్‌ హైస్కూల్‌కు చెందిన పలువురు విద్యార్థులు ఎస్‌జీఎఫ్‌ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల పీడీ సుబ్బన్న తెలిపారు. అండర్‌–17 ఫుట్‌ బాల్‌ విభాగంలో ఎ.సుశాంత్‌, అండర్‌–14 హాకీ విభాగంలో పి. పవన్‌కుమార్‌, ఎం.వెంకట రాముడు రాష్ట్ర స్థాయి ఎస్‌జీఎఫ్‌ పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 11 నుంచి రాజమండ్రిలో జరిగే పోటీలకు వారు హాజరవుతారని పీడీ సుబ్బన్న తెలిపారు. అలాగే కబడ్డీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జూనియర్స్‌ విభాగంలో ఎల్‌. మహ్మద్‌ రఫీ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ నెల 16 నుంచి మార్కాపురంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు అతడు జిల్లా జట్టు తరపున ఆడనున్నాడు. అలాగే సబ్‌ జూనియర్స్‌ విభాగంలో ఎల్‌. ఉమర్‌ బాషా రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. నూజివీడులో ఈ నెల 10 నుంచి జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు అతను హాజరు కానున్నాడు. కాగా శుక్రవారం విజేతలకు పాఠశాల హెచ్‌ఎం ఖాజా పర్వీన్‌, పీడీ సుబ్బన్న అభినందించారు.

చదువుతోనే ఉన్నత స్థానం

కడప ఎడ్యుకేషన్‌: చదువు మాత్రమే మ నిషిని ఉన్నత స్థాయిలో నిలబెడుతుందని, విశ్వవిద్యాలయ వనరులను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు లక్ష్యాలను సాధించాలని యోగి వేమన విశ్వవిద్యాలయం రెక్టార్‌ ప్రొఫెసర్‌ ఏజీ దాము పేర్కొన్నారు. వైవీయూ కామర్స్‌ శాఖ ఆధ్వర్యంలో జరిగిన వాణిజ్య ప్రవేశ సదస్సు (ఓరియంటేషన్‌) – 2కే26 ముగింపు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, క్రమశిక్షణతో కూడిన విద్య, నైపుణ్యాలు విద్యార్థులను విజేతలుగా నిలుపుతాయన్నారు. విద్యార్థులు గ్రంథాలయంలో ఎక్కువ సమయం గడపాలని సూచించారు. కామర్స్‌ శాఖ విభాగాధిపతి ఆచార్య రఘునాథరెడ్డి మాట్లాడుతూ, ఈ విభాగం భావి తరాల పారిశ్రామికవేత్తలను తయారు చేసే ప్రయోగశాల లాంటిదన్నారు. అనంతరం విద్యార్థులు కొప్పర్తి పారిశ్రామిక వాడలోని ట్రయోవిజన్‌ కంపెనీని సందర్శించి, వాహనాల విడిభాగాల తయారీ విధానాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆచార్య జి.విజయభారతి, కాంటాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు రజనీ, హరినాథరెడ్డి, మహ్మద్‌ రఫి, రామ్‌ ప్రసాద్‌ రెడ్డి, డా.నిరోషా, మహేష్‌, జర్నలిజం శాఖ సహాయ ఆచార్యులు డాక్టర్‌ తుమ్మలూరు సురేష్‌ బాబు, విద్యార్దులు పాల్గొన్నారు.

కడప విజిలెన్స్‌ రీజినల్‌ అధికారి బదిలీ

కడప అర్బన్‌: కడప జిల్లా విజిలెన్స్‌ అండ్‌ ఎనన్‌ఫోర్స్‌మెంట్‌ రీజినల్‌ అధికారి, ఎస్పీ రామాంజనేయులు విజయవాడకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో నెల్లూరు విజిలెన్‌న్స్‌ ఎస్పీ కొల్లి శ్రీనివాసరావు నేటి నుంచి ఇన్‌చార్జి అధికారిగా బాధ్యతలు నిర్వహించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement