బ్యాంక్‌ ఉద్యోగిపై కేసు | - | Sakshi
Sakshi News home page

బ్యాంక్‌ ఉద్యోగిపై కేసు

Sep 30 2026 1:52 AM | Updated on Sep 30 2026 1:52 AM

ప్రొద్దుటూరు క్రైం : లోన్‌ ఇప్పిస్తానని నమ్మించి రూ. 18 లక్షలు తీసుకొని ఏడాది కాలంగా పట్టించుకోకుండా తిరుగుతున్న బ్యాంకు ఉద్యోగిపై ప్రొద్దుటూరు రూరల్‌ పోలీసులు చీటింగ్‌ కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ప్రొద్దుటూరు ఎన్జీఓ కాలనీకి చెందిన దిలీప్‌నకు లోన్‌ ఇప్పిస్తానని సిటీ యూనియన్‌ బ్యాంకులో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పని చేసిన జోసఫ్‌ ఆమ్‌స్ట్రాంగ్‌ హామీ ఇచ్చాడు. ఈ క్రమంలోనే అతను లోన్‌ ఇప్పిస్తానని చెప్పి దిలీప్‌ వద్ద నుంచి రూ.18 లక్షలు తీసుకున్నాడు. డబ్బులు తీసుకొని ఏడాది గడిచినా లోన్‌ ఇప్పించకపోగా, డబ్బులు తిరిగి ఇవ్వకుండా అదిగో.. ఇదిగో అంటూ కాలయపన చేస్తున్నాడు. దీంతో దిలీప్‌ పోలీసులను ఆశ్రయించాడు. ప్రస్తుతం జోసఫ్‌ ఆమ్‌స్ట్రాంగ్‌ తమిళనాడు రాష్ట్రంలో పని చేస్తున్నాడు. బాఽధితుడు దిలీప్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం జోసఫ్‌ ఆమ్‌స్ట్రాంగ్‌పై చీటింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీకాంత్‌ తెలిపారు.

ఈ–కేవైసీ నివేదికలు

మా పరిధిలో ఉండవు

– సాక్షి కథనంపై డీఎస్‌ఓ వివరణ

కడప సెవెన్‌రోడ్స్‌ : రోజువారి వినియోగదారుల ఈ–కేవైసీ నివేదికలు తమ పరిధిలో ఉండవని, అవి సంబంధిత ఆయిల్‌ కంపెనీల సేల్స్‌ ఆఫీసర్ల లాగిన్‌లో మాత్రమే ఉంటాయని జిల్లా పౌరసరఫరాల అధికారి రఘురాం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సోమవారం ‘గ్యాస్‌ సబ్సిడీకి....ఈకేవైసీ గండి’ అనే శీర్షికన సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనంపై ఆయన స్పదించారు. సేల్స్‌ ఆఫీసర్‌ ఇచ్చిన నివేదిక మేరకు జిల్లాలో హెచ్‌పీసీఎల్‌, ఐఓసీఎల్‌, బీపీసీఎల్‌ కంపెనీలకు చెందిన మొత్తం వినియోగదారులు 4,61,085 మంది ఉన్నారని తెలిపారు. వీరిలో 4,38,961 (95.20 శాతం) మంది ఈ–కేవైసీ చేయించుకున్నారని, ఇక 22,124 (4.80 శాతం) మంది పెండింగ్‌లో ఉందని వివరించారు. ఇప్పటికే ఈ–కేవైసీ పూర్తి చేసుకున్న వారు తిరిగి చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. పెండింగ్‌లో ఉన్న వినియోగదారులు అక్టోబరు 1వ తేదీలోపు ఈ–కేవైసీ చేయించుకోవాలని సూచించారు.

బీఈడీ, ఎంఈడీ రెండో

సెమిస్టర్‌ ఫలితాలు విడుదల

కడప ఎడ్యుకేషన్‌ : యోగి వేమన విశ్వవిద్యాలయం పరిధిలోని బీఈడీ, ఎంఈడీ కళాశాలల విద్యార్థుల రెండవ సెమిస్టర్‌ పరీక్షల ఫలితాలను ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్‌ మంగళవారం విడుదల చేశారు. విశ్వవిద్యాలయంలోని తన ఛాంబర్‌ లో రెక్టార్‌ ప్రొఫెసర్‌ ఎ.జి.దాము, కులసచివులు ఆచార్య ఎన్‌.సి., గంగిరెడ్డి, పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య టి. లక్ష్మి ప్రసాద్‌తో కలిసి పరీక్షల వివరాలు వెల్లడించారు. బీఈడీ పరీక్షలకు 4524 పంది విద్యార్థులు హాజరు కాగా 3,792 (83.82 శాతం)మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అలానే ఎంఈడీ పరీక్షలకు 64మంది హాజరు కాగా 22 (34.38 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. కార్యక్రమంలో పరీక్షల విభాగ సహాయ అధికారులు ఆచార్య సునీత పాల్గొన్నారు.

విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయురాలు

ప్రొద్దుటూరు కల్చరల్‌ : పరీక్షలో ప్రశ్నకు సమాధానం రాయలేదన్న కారణంతో 6వ తరగతి విద్యార్థిని బెత్తంతో కొట్టిన సంఘటన ప్రొద్దుటూరు పట్టణంలో చోటుచేసుకుంది. కొర్రపాడు రోడ్డులోని సంగమేశ్వర హైస్కూల్‌లో 6వ తరగతి చదువుతున్న విద్యార్థి తమన్‌ను సోషల్‌ ఉపాధ్యాయురాలు శ్రీలీల పరీక్షలో సమాధానం రాయలేదని సోమవారం వీపు రక్తం గడ్డ కట్టేలా కొట్టింది. విద్యార్థి వీపుపై ఉన్న వాతలను చూసిన తల్లిదండ్రులు మంగళవారం పాఠశాలకు చేరుకుని యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడకు చేరుకున్న ఎంఈఓ సావిత్రమ్మ పాఠశాలకు చేరుకుని సంఘటనపై విచారణ జరిపారు. ఉపాధ్యాయురాలిని విధుల నుంచి తొలగించాలని, ఘటనపై నోటీసు ఇచ్చారు. కరస్పాండెంట్‌ శివచంద్రారెడ్డిని ఇటువంటి సంఘనటలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement