ప్రొద్దుటూరు క్రైం : పట్టణంలోని కొర్రపాడు రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీహార్ రాష్ట్రానికి చెందిన మంఽథన్ మంఝూషి (24) మృతి చెందాడు. ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మైనర్ బాలుడు సోమవారం రాత్రి టీవీఎస్ ఎక్సెల్‌పై అజాగ్రత్తగా వెళ్తూ ఎదురుగా వస్తున్న బీహార్ రాష్ట్రానికి చెందిన మంథన్ మంఝాహి బైక్‌ను ఢీ కొట్టడంతో తలకు బలమైన గాయమై తీవ్ర రక్తస్రావమైంది. దీంతో అతన్ని వెంటనే చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ రాత్రి పొద్దుపోయాక మృతి చెందాడు. ఇదే ఘటనలో గాయపడిన మైనర్ బాలుడు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ట్రాఫిక్ సీఐ భాస్కర్ తెలిపారు. మైనర్లు వాహనాలు నడపడం చట్టవిరుద్ధమే కాకుండా ప్రమాదకరమని సీఐ హెచ్చరించారు.
గంజాయి విక్రేత అరెస్ట్
పులివెందుల రూరల్ : గంజాయి విక్రేతను అరెస్టు చేసి అతని వద్ద నుంచి 750 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ తెలిపారు. మంగళవారం పట్టణంలోని స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఆయన రూరల్ సీఐ శాంతి లాల్, లింగాల మండల ఎస్‌ఐ జగదీశ్వరరెడ్డిలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లింగాల మండలం కోమన్నూతల గ్రామానికి చెందిన నడిపి వెంగముని నేర్జాంపల్లె గ్రామానికి వెళ్లే మార్గంలో ఎగువ గట్టపై ఉన్న అడ్డి తోటలో గంజాయి సాగు చేస్తున్నట్లు సమాచారం రావడంతో అతన్ని అరెస్టు చేసి అతని వద్ద నుంచి 750 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు. కోమన్నూతల గ్రామానికి చెందిన వెంగమని గత కొంతకాలంగా గంజాయి మొక్కలు పెంచుతుండడంతో సమాచారం రావడంతో మంగళవారం 3గంటల ప్రాంతంలో తనిఖీలు చేయగా.. ఆరడుగుల ఎత్తు గల గంజాయి మొక్కలతోపాటు ఇంటి వద్ద గంజాయి ఆకులను స్వాధీనం చేసుకున్నామన్నారు.
కడప శివార్లలో లారీ దహనం
కడప అర్బన్ : తమిళనాడులోని నైవేలి నుంచి హైదరాబాద్‌కు లిగ్నైట్ (గోధుమ బొగ్గు) లోడ్‌తో వెళ్తున్న లారీ నగర శివార్లలోని అలంఖాన్‌పల్లి ఇర్కాన్ సర్కిల్ సమీపంలో అగ్ని ప్రమాదానికి గురైంది. బొగ్గులో సహజంగా వేడి పెరిగి మంటలు చెలరేగే ‘స్పాంటేనియస్ కంబషన్’ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. లారీ నుంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. కడప అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకుని మంటలను పూర్తిగా అదుపు చేశారు. అయితే ఈ ప్రమాదంలో లారీతో పాటు బొగ్గు పూర్తిగా బూడిదైంది. ప్రమాదం వల్ల సుమారు రూ.29,54,000 మేర నష్టం వాటిల్లినట్లు లారీ యజమాని పార్థసారథి అధికారులకు ఫిర్యాదు చేయగా, అగ్నిమాపక సిబ్బంది కేసు నమోదు చేశారు.
750 గ్రాముల గంజాయి స్వాధీనం


