ప్రొద్దుటూరు : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను కూటమి ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ బాధలను చెప్పుకోవడానికి అమరావతి, విజయవాడ వెళ్లిన సచివాలయ సిబ్బందిపై ప్రభుత్వం నీచంగా, అమానుషంగా దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకే సంతకంతో ఏకంగా 1.30 లక్షల సచివాలయ ఉద్యోగాలను అత్యంత పారదర్శకంగా, ఎక్కడా చిన్న విమర్శకు తావులేకుండా భర్తీ చేశారని రాచమల్లు గుర్తుచేశారు. ఎంతో ఉన్నత చదువులు చదివి, పోటీ పరీక్షలు రాసి ఉద్యోగాలు సాధించిన వారిని బానిసల్లా చూడటం మానేసి, ఆత్మగౌరవాన్ని కాపాడాలన్నారు. నిరసన తెలపడానికి వస్తే ఉద్యోగులను పశువుల్లా ఈడ్చి వ్యాన్‌లలోకి ఎక్కించడం దారుణమన్నారు. వలంటీర్లను తప్పించి వారి విధులన్నీ సచివాలయ ఉద్యోగులపై వేసి, వారితో ఉద్యోగం బదులు ఊడిగం చేయిస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగులను 11 రకాల ఇతర సేవలకు వినియోగించుకునేందుకు ప్రభుత్వం జారీ చేసిన దుర్మార్గపు జీఓ నంబర్ 11ను తక్షణమే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ పని ఒత్తిడి భరించలేక రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 400 మంది సచివాలయ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోతే.. వారికి కనీసం పరిహారం ఇవ్వకపోగా, వారి కుటుంబీకులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగ అవకాశం కూడా కల్పించలేదని దుయ్యబట్టారు. సిబ్బందికి కొత్త పీఆర్సీ ఇవ్వలేదని, పాత వేతన అరియర్స్ చెల్లించలేదని, మహిళా ఉద్యోగులకు కనీస హక్కు అయిన ప్రసూతి సెలవులు కూడా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విపరీతమైన ఒత్తిడి, ముందే ఉన్న అనారోగ్యం కారణంగానే విధి నిర్వహణలో సీఐ ఆలీ మరణించారని విమర్శించారు. ఇదే సమయంలో ఒక టీవీ ఛానల్ (టీవీ5) చర్చా వేదికలో సచివాలయ ఉద్యోగుల వ్యవస్థపై, సిబ్బందిపై సాంబశివరావు అత్యంత అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమన్నారు. ఎంతో కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించిన వారిని పట్టుకుని ‘బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, పోరంబోకులు’ అంటూ తన ఛానల్‌లో మాట్లాడటం పట్ల రాచమల్లు తీవ్రంగా మండిపడ్డారు. ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడిన సాంబశివరావు వెంటనే సచివాలయ ఉద్యోగులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లు తెరిచి సచివాలయ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో వారికి అండగా నిలిచి వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని రాచమల్లు శివప్రసాదరెడ్డి స్పష్టం చేశారు.
వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి,
మాజీ ఎమ్మెల్యే రాచమల్లు డిమాండ్


