వేంపల్లె : చక్రాయపేట మండల పరిధిలోని గండి క్షేత్రం ఆలయానికి టెంకాయల వేలం ద్వారా రూ.95.10 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ విశ్వనాథ్ పేర్కొన్నారు. మంగళవారం ఆలయ కార్య నిర్వహణ కార్యాలయంలో టెంకాయల విక్రయానికి బహిరంగ వేలం నిర్వహించారు. వేలంలో 11 మంది డిపాజిట్‌దారులు పాల్గొనగా.. కుప్పాలపల్లెకు చెందిన రామగంగి రెడ్డి హెచ్చు పాట పాడి టెంకాయల విక్రయించేందుకు హక్కును దక్కించుకున్నాడు. గత ఏడాది రూ.75.35 లక్షలు పాడగా.. ఏడాది రూ.2 లక్షలు అదనంగా ఆదాయం వచ్చింది. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వెంకటస్వామి, కమిటీ సభ్యులు, వేలంపాటదారులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలు
అట్లూరు : మండల పరిధిలోని అట్లూరు క్రాస్ రోడ్డులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగటి సుబ్బనరసయ్య అనే వ్యక్తి తీవ్రగాయాలపాలయ్యాడు. స్థానికుల వివరాల మేరకు కొండూరు ఎస్సీ కాలనీకి చెందిన సంగటి సుబ్బనరసయ్య తన అల్లుడు బుజ్జయ్యతో కలిసి ద్విచక్రవాహనంపై అట్లూరు నుంచి గ్యాస్ సిలిండర్ తెచ్చుకునేందుకు బయల్దేరారు. అట్లూరు క్రాస్ రోడ్డు సమీపానికి వెళ్లే సరికి కడప నుంచి ఆయిల్ ట్యాంకర్ మరో ఆయిల్ ట్యాంకర్‌ను ఓవర్ టేక్ చేయబోయి ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ప్రమాదంలో సంగటి సుబ్బనరసయ్య తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన అతనిని 108 అంబులెన్స్‌లో కడప రిమ్స్‌కు తరలించారు. పోలీసులు కేసు విచారణ చేపట్టారు.
బాధ్యతల స్వీకరణ
కడప అర్బన్ : వైఎస్‌ఆర్ కడప జిల్లా ప్రధాన సెషనన్స్ కోర్టుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమితులైన జి. శివశంకర్ రెడ్డి మంగళవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి రామ్ గోపాల్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకేను అందించారు.


