● పీజీఆర్‌ఎస్‌కు బాధితుల క్యూ ● సమస్య తీరక సతమతం ● సన్నగిల్లుతున్న నమ్మకం
దండం పెడుతున్నా...పింఛన్ ఇప్పించండయ్యా!
పళ్లు ఊడిపోయి బోసిపోయిన ఆ నోరు చెబుతోంది ఒంటిపైకొచ్చిన తన వద్ధాప్యాన్ని... ముడతలు పడ్డ చర్మం చెబుతోంది ఆమె దీనస్థితిని.. కాంతి లేని కళ్లు.. తెల్లగా మారిన కేశాలు తన దుస్థితికి సాక్ష్యమిస్తున్నాయి.... కళ్లు మూసుకున్న చంద్రబాబు సర్కారుకు ఇవేమీ కనిపించడం లేదు.. అధికారులకా అవేవీ పట్టడం లేదు.. ఈ వృద్ధురాలి పేరు ఎస్.నాగలక్షుమ్మ, ప్రొద్దుటూరు మండలం ఉప్పరపల్లె గ్రామం. పెన్షన్ తీసుకుంటున్న ఈమెకు రెండేళ్ల కిందట పెన్షన్ ఆగిపోయింది. అన్ని అర్హతలు ఉన్నా ఎందుకు పెన్షన్ తొలగించారో అధికారులను అడిగింది.. సమాధానం లేదు. ఇటీవల కొత్త పెన్షన్లు వచ్చినపుడు మళ్లీ దరఖాస్తు చేసుకుంది. కానీ, ఆన్‌లైన్‌లో తమకు పెన్షన్ రాదని చూపుతోందని తేల్చి చెప్పారు. ‘అయ్యా వృద్ధురాలిని. వస్తున్న పెన్షన్ రాకుండా పోయింది. దండం పెడుతున్నా...పెన్షన్ ఇప్పించడయ్యా’ అంటూ అధికారులకు చేతులెత్తి వేడుకుంది.
నిలబడలేకున్నా...సాయం చేయండి
పట్టుమని పది సెకన్లు నిలవలేని ఈ పరిస్థితి ఈ దివ్యాంగురాలిది. పేరు ఎం. కల్యాణి . పులివెందుల మండలం ఉలిమెళ్ల గ్రామం. నిలబడలేక ఇదిగో ఇలా అధికారుల టేబుల్‌పైనే కూలబడింది. తన దీనస్థితిని చూసైనా అధికారులు కనికరించలేదని.. సదరం సర్టి ఫికెట్ ఇవ్వడం లేదని వాపోయింది. సోమవారం కలెక్టరేట్‌కు కుటుంబ సభ్యులతో వచ్చి పీజీఆర్‌ఎస్‌లో సమస్యను విన్నవించారు.‘నడవలేవని దివ్యాంగురాలిని.. సదరం సర్టిఫికెట్‌తో పాటు పెన్షన్ ఇప్పించండి సారూ’ అంటూ కన్నీటిపర్యంతమైంది.


