ఎయిర్‌బస్‌ స్టాండ్‌ ! | - | Sakshi
Sakshi News home page

ఎయిర్‌బస్‌ స్టాండ్‌ !

Sep 29 2026 12:21 AM | Updated on Sep 29 2026 12:21 AM

వాస్తవాలు మరుగునపడవు

● కూటమి సర్కారులోనే పులివెందుల బస్టాండ్‌కు ప్రతిష్టాత్మక స్టేట్‌ అవార్డు

● రూ.38 కోట్లతో ఎయిర్‌పోర్ట్‌ స్థాయి హంగులు.. నాణ్యతకు దక్కిన ‘పర్యాటక’ కిరీటం

● రాజకీయ ఆరోపణలు పటాపంచలు.. పాలకుల విమర్శలకు అవార్డే గట్టి సమాధానం

● ఆసియాలోనే అతిపెద్ద టెర్మినల్‌.. 55 సీసీ కెమెరాల నిఘాలో సుందర దృశ్యం

పులివెందుల: ఆసియాలోనే అతిపెద్ద బస్‌ టెర్మినల్‌గా అరుదైన గుర్తింపు దక్కించుకున్న పులివెందుల వైఎస్సార్‌ బస్‌ టెర్మినల్‌కు ప్రతిష్టాత్మక రాష్ట్ర పర్యాటక అవార్డు లభించింది. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరంలో ఆదివారం జరిగిన ప్రత్యేక అధికారిక కార్యక్రమంలో ‘ఉత్తమ పర్యాటక అనుకూల బస్టాండ్‌’ విభాగంలో ఈ పురస్కారాన్ని అందజేశారు.

ఎయిర్‌పోర్ట్‌ స్థాయి సదుపాయాలు

ప్రయాణీకులకు సకల సౌకర్యాలతో, ఎంతో ప్రతిష్టాత్మకంగా అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన ఈ బస్టాండ్‌ ఎయిర్‌పోర్టును తలపించేలా ఉందని ప్రజలు కొనియాడుతున్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, అప్పటి ఆర్టీసీ ఛైర్మన్‌ దుగ్గాయపల్లి మల్లికార్జునరెడ్డిల ప్రత్యేక సారథ్యంలో మొత్తం రూ.38 కోట్ల భారీ బడ్జెట్‌ వ్యయంతో ఈ అత్యాధునిక బస్‌ కాంప్లెక్స్‌ను నిర్మించారు. సరిగ్గా 2022 డిసెంబర్‌ 24వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమై ఈ బస్‌ టెర్మినల్‌ ప్రజలకు అంకితమైంది.

బస్‌ టెర్మినల్‌లోని ప్రధాన వసతులు ఇవే

● ప్రయాణికులకు అంతర్జాతీయ స్థాయి అనుభూతిని ఇచ్చేలా ఈ వినూత్న టెర్మినల్‌లో అద్భుతమైన మౌలిక వసతులను కల్పించారు

● కూర్చునే సామర్థ్యం: ఒకేసారి 225 మంది ప్రయాణికులు కూర్చునేందుకు వీలుగా బస్టాండ్‌ అంతటా 95 అత్యాధునిక బెంచీలను ఏర్పాటు చేశారు.

● ప్రత్యేక హాల్స్‌: ప్రయాణికులు సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రశాంతంగా వేచి ఉండేలా స్పెషల్‌ వెయిటింగ్‌ హాల్స్‌ అందుబాటులో ఉన్నాయి.

● భద్రతకు పెద్దపీట: ప్రయాణీకుల, మహిళల భద్రత కోసం నిత్యం 55 సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేశారు.

● దివ్యాంగులకు ఫ్రెండ్లీగా: ఈ బస్టాండ్‌ను వికలాంగులకు సైతం ఎంతో అనుకూలంగా ఉండేలా నిర్మించారు. వారికి రాకపోకల ఇబ్బంది లేకుండా ప్రత్యేక ర్యాంపులు, వసతులతో పాటు విడిగా మరుగుదొడ్లను సైతం నిర్మించారు.

● శుభ్రత – తాగునీరు: ప్రయాణికుల కోసం 13 ఆధునిక మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. అలాగే ఆర్వో ప్లాంట్‌ ద్వారా నిరంతరాయంగా సురక్షితమైన తాగునీరు అందుబాటులో ఉంచారు.

● ఇతర డిజిటల్‌ సౌకర్యాలు: ప్రథమ చికిత్స కోసం ప్రత్యేక కిట్లు, అత్యాధునిక టికెట్‌ కౌంటర్లు, క్యాష్‌లెస్‌ లావాదేవీల కోసం నగదు రహిత చెల్లింపుల వసతులను ఇక్కడ కల్పించారు.

దీనితో పాటు ప్రయాణికులకు అందుబాటులో క్యాంటీన్లు, ఆర్టీసీ సిబ్బందికి కావాల్సిన విశ్రాంతి వసతులు అన్నీ సమకూర్చారు.

వరప్రసాద్‌, చిన్నప్ప, హాలు గంగాధరరెడ్డి

పులివెందుల వైఎస్సార్‌ బస్‌ టెర్మినల్‌ నియోజకవర్గంలోని ఏడు మండలాల ప్రజలకు ఒక వరం లాంటిదని, నాణ్యతలో ఎక్కడా రాజీ లేకుండా చిత్తశుద్ధితో దీనిని నిర్మించామని మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ వరప్రసాద్‌ తెలిపారు. గతంలో ఈ బస్టాండు నిర్మాణ సమయంలో ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడుతో సహా స్థానిక టీడీపీ నేతలు అసలు నిర్మాణమే సరిగా లేదంటూ అనేక కుటిల విమర్శలు, రాజకీయ ఆరోపణలు చేశారని, కానీ ఇప్పుడు వారి కూటమి ప్రభుత్వ హయాంలోనే దీనికి అత్యుత్తమ రాష్ట్రస్థాయి అవార్డు దక్కడం గమనార్హమని మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ చిన్నప్ప పేర్కొన్నారు. ‘నిజమైన వాస్తవాలు ఎప్పటికీ మరుగునపడవు’ అన్నట్లుగా.. ఇప్పుడు ఈ ప్రతిష్టాత్మక అవార్డు రావడంతోనే వైఎస్సార్‌సీపీ హయాంలో జరిగిన నాణ్యమైన అసలు సిసలైన అభివృద్ధి ఏంటో నిరూపితమైందని వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు హాలు గంగాధరరెడ్డి స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement