సాఽదారణంగా గణనాథుడి నిమజ్జనం అంటే భారీ లారీలు, డీజేల హడావుడి కనిపిస్తుంది. కానీ, రాయచోటిలో మాత్రం వినాయకుడు అత్యంత వైవిధ్యంగా సహజసిద్ధమైన ఎద్దుల బండిపై నిమజ్జనానికి తరలివెళ్లాడు. జిల్లా వ్యాప్తంగా ఆదివారం నాటితో వినాయక నిమజ్జనాల పర్వం అధికారికంగా ముగిసినప్పటికీ, పట్టణంలోని పాత రాయచోటిలో మాత్రం సోమవారం నాడు స్వామివారిని స్థాన చలనం చేశారు. లంబోదరుడిని తరలించేందుకు స్థానికులు ఎద్దుల బండిని రంగరంగుల పూలమాలలతో, గొడుగులతో ఎంతో సుందరంగా అలంకరించారు. చిత్రంలో కనిపిస్తున్నట్లుగా భక్తులు భక్తిశ్రద్ధలతో బండిపై స్వామివారిని ఉంచి పాత రాయచోటి వీధుల్లో ఊరేగించారు. డప్పుల వాయిద్యాలు, మేళతాళాలు, జానపద నృత్యాలు, కోలాట భజనల మధ్య భక్తులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ కేరింతలతో అత్యంత వైభవంగా స్వామివారిని నాగిరెడ్డి శ్రీనివాస రిజర్వాయర్‌కు తరలించి నిమజ్జనం చేశారు. – రాయచోటి టౌన్


