కడప రూరల్ : వైద్యాధికారులు ప్రజాసేవ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ యుగంధర్, ఐజీఓటీ కర్మయోగి జిల్లా నోడల్ అధికారి డాక్టర్ హీరేందర్ అన్నారు. గురువారం స్థానిక జిల్లా కార్యాలయంలో కర్మయోగి కార్యక్రమం పై వైద్యాధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల జ్ఞానం, నైపుణ్యాలు, సామర్థ్యాలు, పరిపాలనా దక్షత, ప్రజాసేవా నైపుణ్యాలను పెంపొందించడం కర్మయోగి కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అన్నారు. ఉద్యోగులు తమ విధులకు సంబంధించిన వివిధ అంశాలపై నిరంతరం శిక్షణ పొందడంతో పాటు, ప్రభుత్వ కార్యక్రమాలు, పరిపాలనా విధానాలు, నాయకత్వ నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహనను పెంచుకోవచ్చు అని తెలిపారు.
నేడు నులిపురుగుల దినోత్సవం
అనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ యుగంధర్ శుక్రవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించే జాతీయ నులిపురుగుల దినోత్సవం పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 2744 అంగన్‌వాడీ సెంటర్లలో, 2832 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కాలేజీల్లో 5,31,354 మంది బాల బాలికలను గుర్తించినట్లు చెప్పారు. 1 నుంచి 19 సంవత్సరాల పిల్లలందరికీ నులిపురుగుల నివారణ మాత్రలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ అంధత్వ నియంత్రణ కార్యక్రమ సంయుక్త సంచాలకులు డాక్టర్ సునీల్ కుమార్ నాయక్ మాట్లాడుతూ ప్రతి స్కూల్‌లో పిల్లలకు చేతులశుభ్రత, వ్యక్తిగత శుభ్రత, గురించి అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఐఓ డాక్టర్ ప్రవీణ్ కుమార్, ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ మహమ్మద్ తాహా, ఆర్‌బీఎస్‌కే ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ అరిఫుల్లా, డెమో భారతి, డిప్యూటీ డెమో కుమారి తదితరులు పాల్గొన్నారు.


