ప్రధాన పంటల సాగు వివరాలు (హెక్టార్లలో)
● ప్రత్యామ్నాయ పంటలే శరణ్యం!
● జిల్లా వ్యవసాయ శాఖాధికారుల
కీలక ప్రణాళిక
కడప అగ్రికల్చర్: జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ఆరుతడి పంటల రైతులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో కొంత ఆశాజనకంగా వర్షం కురిసినా, ఆ తర్వాత నుంచి వరుణుడు పూర్తిగా ముఖం చాటేశాడు. దీంతో ఖరీఫ్ ప్రారంభమై 100 రోజులు దాటినప్పటికీ సాగు విస్తీర్ణం 52.9 శాతానికే చేరింది. మరో 12 రోజుల్లో పూర్తి ఖరీఫ్ సీజన్ కూడా ముగియనుండటంతో, ఈ ఏడాది పెట్టుబడులు కూడా దక్కవని అన్నదాతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాధారం కింద సాగు చేసిన ఆరుతడి పంటల రైతుల్లో ఆందోళన గుబులు రేపుతోంది. వర్షం వస్తుందో లేదోనన్న దిగులు అన్నదాతలను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
జూలై నుంచి సెప్టెంబర్ దాకా ముఖం చాటేసిన వరుణుడు
సాధారణంగా ఖరీఫ్‌లో వేరుశనగ, కంది, మినుము, సోయాబీన్, పత్తి, మొక్కజొన్న తదితర ప్రధాన పంటలు విత్తుకునేందుకు జూలై నెల మంచి పదునైన సమయం. అయితే ఈ కీలకమైన జూలై నెలలోనే వరుణుడు ముఖం చాటేయడంతో ఖరీఫ్ ఏరువాక సాగుపై కోలుకోలేని దెబ్బ పడింది. జిల్లాను కరువు కోరల్లోకి నెట్టేసింది.
ఖరీఫ్ సీజన్ నెలవారీ వర్షపాత లోటు వివరాలు ఇలా ఉన్నాయి...
జూన్: సాధారణ వర్షపాతం 68.2 ఎంఎం కాగా, కురిసింది 50.3 ఎంఎం మాత్రమే. అంటే – 26.3 శాతం లోటు నమోదైంది.
జూలై: సీజన్ మార్చే ఈ నెలలో సాధారణ వర్షపాతం 96.7 ఎంఎం కు అత్యంత దారుణంగా కేవలం 24.5 ఎంఎం మాత్రమే కురిసింది. అంటే ఏకంగా – 74.7 శాతం లోటు వర్షపాతం అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లింది.
ఆగస్టు: సాధారణ వర్షపాతం 118.4 ఎంఎం కాగా, 66.7 ఎంఎం మాత్రమే కురిసింది. ఇందులోనూ – 43.7 శాతం లోటు మిగిలింది.
సెప్టెంబర్: ఈ నెలలో సాధారణ వర్షపాతం 117.2 ఎంఎం కాగా, నేటివరకు కురిసింది కేవలం 3.3 ఎంఎం మాత్రమే. ఇంకా– 94.1 శాతం మేర భారీ లోటు కొనసాగుతోంది.
మొత్తంగా ఖరీఫ్ సీజన్ సాధారణ వర్షపాతం 400.5 ఎంఎం కాగా, జిల్లాలో నమోదైంది కేవలం 144.8 ఎంఎం మాత్రమే. దీనివల్ల సీజన్ మొత్తమ్మీద –57.4 శాతం భయంకరమైన లోటు వర్షపాతం నమోదైంది.
40449 హెక్టార్లకే పరిమితం..
బోర్లలోనూ ‘నీటి’ కరువు
జిల్ల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 76,496 హెక్టా ర్లు కాగా.. ఇందులో 40449 హెక్టార్లలో (52.9 శాతం) మాత్రమే వివిధ పంటలు సాగయ్యాయి. ఇందులో 16,074 హెక్టార్లలో ఆరుతడి పంటలను వర్షాధారంగా సాగు చేయగా, మరో 22747 హెక్టార్లలో బోరు బావుల కింద పంటలను సాగు చేశారు. వర్షాలు లేకపోవడంతో భూగర్భ జలాలు వేగంగా అడుగంటుతున్నాయి. చాలా ప్రాంతాల్లో బోర్లలో సైతం నీరు సరిగా రావడం లేదని, మరో 10 నుంచి 15 రోజుల్లో బోర్లలో నీరు పూర్తిగా తగ్గే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏమాత్రం తేడా వచ్చినా తాము పెట్టిన లక్షల రూపాయల పెట్టుబడులు మట్టిపాలవుతాయని అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నారు.
వేరుశనగ: సాధారణ సాగు విస్తీర్ణం 4,446 హెక్టా ర్లు కాగా.. సీజన్ ముగిసే సమయానికి కేవలం 3,612 హెక్టార్లలో (81.2శాతం) మాత్రమే సాగైంది. ఇందులో 2,585 హెక్టార్లు వర్షాధారం కింద, 1,027 హెక్టార్లు బోర్ల కింద సాగైంది. అక్కడక్కడ వేరుశనగ పంట వాడుముఖం పట్టడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
పత్తి: సాధారణ సాగు 22,469 హెక్టార్లు ఉండగా.. ఇప్పటివరకు 9,280 హెక్టార్లలోనే (41.3 శాతం) సాగైంది. ఇందులో 2,245 హెక్టార్లలో బోర్ల కింద సాగు చేయగా, మిగతా 7,035 హెక్టార్లలో వర్షాధారంగా సాగు చేశారు.
కంది: సాధారణ సాగు 5,992 హెక్టార్లు కాగా.. కేవలం 2,156 హెక్టార్లలో (36.0 శాతం) మాత్రమే సాగైంది. ఇందులో కేవలం 29 హెక్టార్లలో మాత్రమే బోర్ల కింద, మిగతా 2,156 హెక్టార్లలో వర్షాధారంగా సాగు చేశారు.
మినుము: సాధారణ సాగు 3,735 హెక్టార్లు కాగా.. 2,847 హెక్టార్లలో (76.0 శాతం) సాగైంది. ఇందులో 154 హెక్టార్లు మాత్రమే బోరుబావుల కింద కాగా, మిగతా 2,693హెక్టార్లు వర్షాధారంగా నమోదైంది.
ఖరీఫ్ సీజన్‌లో వర్షాలు పూర్తిగా మొహం చాటేయడం, ఆరుతడి పంటల సాగు గడువు ముగిసిపోవడంతో రైతులు అప్రమత్తం కావాలని జిల్లా వ్యవసాయా ధికారి మట్ట సుబ్రహ్మణ్యేశ్వరరావు సూచిస్తున్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంట నష్టాలను తగ్గించుకునేందుకు ఈ క్రింది ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలని కోరుతున్నారు.
ఆరుతడి పంటల స్థానంలో రబీ సన్నాహాలు:
ఖరీఫ్‌లో విత్తుకోలేకపోయిన పొలాలను అలాగే వదిలేయకుండా, రాబోయే రబీ సీజన్‌కు అనుకూలమైన స్వల్పకాలిక పంటల సాగుకు భూములను సిద్ధం చేసుకోవాలి.
స్వల్పకాలిక/ప్రత్యామ్నాయ పంటలు:
నీటి లభ్యత తక్కువగా ఉన్నా తట్టుకుని నిలబడే జొన్న, సజ్జ, కొర్రలు, రాగులు వంటి తృణధాన్యాల పంటలతో పాటు.. రబీ సీజన్ ప్రారంభంలో శనగ, పొద్దుతిరుగుడు (సన్‌ఫ్లవర్), కుసుమలు వేసుకోవడం లాభదాయకం.
నీటి యాజమాన్య పద్ధతులు:
బోరు బావుల కింద నీటి లభ్యత క్రమంగా తగ్గుతున్నందున, సాంప్రదాయ పద్ధతుల్లో కాకుండా డ్రిప్ (బిందు) లేదా స్ప్రింక్లర్ (చిలకరింపు) సేద్యం ద్వారా మాత్రమే తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో తడులు అందించాలి.
పంటల రక్షణ:
ఇప్పటికే సాగు చేసి వాడుముఖం పడుతున్న వేరుశనగ, పత్తి పంటలకు రక్షణగా పొటాషియం నైట్రేట్ 5 గ్రాములు లీటరు నీటికి లేదా 20 గ్రాములు యూరియాను లీటర్ నీటికి కలిసి మొక్క బాగా తడిచేటట్లు పిచికారి చేసుకుంటే మేలు జరుగుతుంది. – మట్ట సుబ్రహ్మణ్యేశ్వర రావు,
జిల్లా వ్యవసాయ అధికారి


