కడప సిటీ : రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ నిష్పక్షపాతంగా, శాంతియుత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం ఎస్‌బీ అంజద్‌బాషలు కోరారు. శుక్రవారం సాయంత్రం వారు మాజీ మేయర్ పాకా సురేష్‌కుమార్, మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, ఎస్సీ సెల్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ పులి సునీల్‌కుమార్, యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు షఫీవుల్లా, మాజీ కార్పొరేటర్ త్యాగరాజు, ఈస్ట్‌జోన్ ప్రెసిడెంట్ రామ్మోహన్‌రెడ్డితో కలిసి కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో పోలీసుల వ్యవహారశైలిపై కూడా ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. రానున్న స్థానిక ఎన్నికల నేపధ్యంలో పోలీసులు ఉద్దేశ పూర్వకంగా కేవలం వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపైనే బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ వారిపై ఎందుకు నమోదు చేయలేదని అడిగితే చేస్తాం...చూస్తామని కాలాయాపన చేస్తున్నారని, ఇది ఎంతవరకు సబబు అన్నారు. నిబంధనల ప్రకారం ఎన్నికలు వచ్చినపుడు కేసులు ఉన్న వారిపై బైండోవర్ కేసులు నమోదు చేయడం సర్వసాధారణమని, నిబంధనల ప్రకారం అన్ని పార్టీలకు ఇది వర్తిస్తుందన్నారు. జిల్లాలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తల అరెస్టుల పర్వం కొనసాగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం వైఎస్సార్ సీపీ పార్టీనే టార్గెట్ చేసి పోలీసులు ఈ వ్యవహారాన్ని కొనసాగిస్తున్నారని, ఇది మంచి పద్దతి కాదన్నారు. అంతేకాకుండా వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై హెచ్చరికలు జారీ చేస్తున్నారన్నారు. ఈ విషయంపై విచారణ జరిపి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని వారు కలెక్టర్‌ను కోరారు.
నిబంధనలు అతిక్రమిస్తే
న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం
ఎన్నికల నియామవళి ప్రకారం నిర్వహణ లేకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఎన్నికలు సజావుగా జరిగేందుకు చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. కలెక్టర్‌ను కలిసి ఈ విషయంపై క్షుణ్ణంగా వివరించామని తెలియజేశామన్నారు. జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్న కలెక్టర్‌పై నమ్మకం ఉందని తెలిపారు. అలా కాకుండా పరిణామాలు మారితే న్యాయస్థానాన్ని ఆశ్రయించి శాంతియుత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేందుకు తమవంతుగా ప్రయత్నంచేస్తామని వారు స్పష్టం చేశారు.
కలెక్టర్‌కు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
రవీంద్రనాథ్‌రెడ్డి, మాజీ డిప్యూటీసీఎం
అంజద్‌బాష వినతి


