ప్రశాంత ఎన్నికలకు పటిష్ట చర్యలు | - | Sakshi
Sakshi News home page

ప్రశాంత ఎన్నికలకు పటిష్ట చర్యలు

Sep 19 2026 5:44 AM | Updated on Sep 19 2026 5:44 AM

బద్వేలు అర్బన్‌ : త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్ట చర్యలు చేపట్టనున్నట్లు కర్నూలు రేంజ్‌ డీఐజీ డాక్టర్‌ కోయప్రవీణ్‌ పేర్కొన్నారు. శుక్రవారం బద్వేలు అర్బన్‌ పోలీసుస్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన ఆయన స్థానిక సంస్థల ఎన్నికలపై సిబ్బందితో చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కర్నూలు రేంజ్‌ పరిధిలో రెండు కార్పొరేషన్లు, 21 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయని, ఈ నేపథ్యంలో ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలోని అన్ని స్టేషన్లను తనిఖీ చేసి సిబ్బందికి క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన విధులపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఎన్నికలు జరగనున్న ప్రాంతాల్లో వారంలో రెండు రోజులు ఎస్‌హెచ్‌ఓలు, ఎస్‌ఐలు, వారంలో ఒక రోజు డీఎస్పీ, 15 రోజుల్లో ఒకసారి అడిషనల్‌ ఎస్పీ, నెల రోజుల్లో ఎస్పీ స్థాయి అధికారులు పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టి స్థానిక పరిస్థితులపై అవగాహన పెంచుకోవాలని కోరారు. ముఖ్యంగా రౌడీషీటర్లు, ట్రబుల్‌మాంగర్స్‌లపై ప్రత్యేక నిఘా ఉంచి ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం మైదుకూరు సబ్‌ డివిజన్‌ పరిధిలో శాంతిభద్రతలపై చేపడుతున్న చర్యల గురించి మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్‌ను అడిగి తెలుసుకున్నారు.

రివార్డులకు సిఫార్సు

రాష్ట్రంలో సంచలనం రేపిన దస్తగిరమ్మ హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష పడిన నేపథ్యంలో శిక్ష పడేందుకు కృషి చేసిన పోలీసు అధికారులకు రివార్డులు అందించేందుకు సిఫార్సు చేయాలని మైదుకూరు డీఎస్పీని ఆదేశించారు. కార్యక్రమంలో అర్బన్‌ సీఐ రామకృష్ణ, పోరుమామిళ్ళ సీఐ హేమసుందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

డీఐజీ కోయప్రవీణ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement