కడప సిటీ : కలెక్టరేట్ భవన సముదాయంలోని ఈవీఎం గోడౌన్లను గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పరిశీలించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా ఈవీఎంలను భద్రపరిచిన గోడౌన్లను తనిఖీ చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి జిల్లా రెవెన్యూ అధికారి మల్లికార్జునుడు, హెచ్ సెక్షన్ సూపరింటెండెంట్ ఈ. శ్రీకాంత్ రెడ్డి, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి
కడప సెవెన్‌రోడ్స్ : మైదుకూరు మున్సిపాలిటీలో చేపడుతున్న అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన మైదుకూరు మున్సిపాలిటీ అభివృద్ధి పురోగతిపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరయ్యారు. సమావేశంలో మైదుకూరు మున్సిపాలిటీతో పాటు నియోజకవర్గంలో వివిధ శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులు వివరాలను కలెక్టర్‌కు అందించారు. తాగునీటి సరఫరా, రహదారులు, డ్రైనేజీ, వీధి దీపాలు, పారిశుద్ధ్యం, పన్నుల వసూళ్లు, పట్టణ ప్రణాళిక, గృహ నిర్మాణ అనుమతులు, పట్టణ పేదల అభివృద్ధి, వివిధ అభివృద్ధి పథకాల కింద చేపడుతున్న పనుల పురోగతిని కలెక్టర్ సమీక్షించారు. ప్రస్తుతం బోరు బావుల ద్వారా 3.65 మిలియన్ లీటర్ల నీరు సరఫరా అవుతుండగా, అవసరానికి తగ్గ నీటి లభ్యత కోసం ప్రత్యామ్నాయ, శాశ్వత వనరులపై దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. రహదారుల అభివృద్ధి, గుంతల పూడ్చివేత, మురుగు కాలువల నిర్మాణం, వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వలు ఏర్పడకుండా కాలువల్లో పూడిక తొలగింపు పనులను నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మైదుకూరు మున్సిపల్ కమిషనర్ రంగస్వామి, తహసీల్దార్ రాజ సింహా నరేంద్ర, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.


