బద్వేలు : జిల్లా ప్రజల ఆరోగ్యం తీవ్ర ప్రమాదంలో పడింది. కల్తీలను నియంత్రించి ప్రజల ఆరోగ్య భద్రతను కాపాడాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. కూరల్లో వేసుకునే కారం నుంచి నూనె వరకూ.. చికెన్, మటన్, చేపల వరకూ ఎక్కడ చూసినా కల్తీ.. జిల్లా ప్రజల్ని కలవరపెడుతోంది. నిరంతరం తనిఖీలు చేయాల్సిన ఫుడ్ సేఫ్టీ అధికారులు మొక్కుబడి తనిఖీలతో మమ అనిపిస్తున్నారు. టార్గెట్‌ల కోసం తనిఖీలు చేయడం తప్ప నిబంధనలు పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై దాడులు చేసిన దాఖలాలు కనిపించడం లేదు.
పూరీ కూరలో చనిపోయిన బల్లి – రంగంలోకి పోలీస్
ఇటీవల ప్రొద్దుటూరు పట్టణంలోని ఓ టిఫిన్ సెంటర్‌లో షేక్ ముస్తాఫా అనే యువకుడు పూరీ కొనుగోలు చేశాడు. అయితే ఇంటికెళ్లి చూడగా పూరీ కూరలో చనిపోయిన బల్లి కనిపించడంతో నిర్ఘాంతపోయాడు. ఇదేమిటని హోటల్ యజమానిని ప్రశ్నించగా, అతను అత్యంత నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. దీంతో బాధితుడు ముస్తాఫా వెంటనే ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. యువకుడి ఫిర్యాదుపై వన్‌టౌన్ సి.ఐ. కొండారెడ్డి తక్షణమే స్పందించి, తన సిబ్బందితో కలిసి సదరు టిఫిన్ సెంటర్‌ను తనిఖీ చేసి, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న హోటల్‌ను వెంటనే మూయించారు. ఆహార భద్రతా అధికారులు చేయాల్సిన తనిఖీలను పోలీసులు చేయాల్సి వస్తోందని, జిల్లాలో ఫుడ్ సేఫ్టీ విభాగం అసలు బతికే ఉందా అని నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిబంధనలు గాల్లో..
ఆహార భద్రత ప్రమాణాల చట్టం ప్రకారం హోటల్స్, రెస్టారెంట్స్, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, ఆహార పదార్థాలు తయారుచేసే యూనిట్లు కచ్చితంగా లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి. ఆ లైసెన్స్ నెంబర్‌ను స్పష్టంగా బోర్డులపై ప్రదర్శించాల్సి ఉన్నా జిల్లాలో ఎక్కడా ఈ నిబంధన పాటించడం లేదు.నరకాన్ని వంటగది, పైకప్పు, నేల ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి. పురుగులు, బొద్దింకలు, ఎలుకలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వంటకు పరిశుభ్రమైన నీటిని మాత్రమే ఉపయోగించాలి. కానీ జిల్లాలోని అత్యధిక హోటళ్లలో కిచెన్, డైనింగ్ ప్రాంతాలు అత్యంత అపరిశుభ్రంగా దర్శనమిస్తున్నాయి.
స్వీట్ షాపుల్లో రంగుల దందా..
కుళ్లిన పదార్థాల విక్రయాలు
నాణ్యత లేని కల్తీ, గడువు తీరిన పదార్థాలను ఉపయోగించరాదని చట్టం చెబుతున్నా.. జిల్లాలోని స్వీట్ దుకాణాలు, క్యాటరింగ్ యూనిట్లు యథేచ్ఛగా హానికరమైన కెమికల్ కలర్స్, కల్తీ పదార్థాలు వాడుతున్నట్లు తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఆహార పదార్థాలను రోజల తరబడి నిల్వ ఉంచడం, కుళ్లిన పదార్థాలను వినియోగదారులకు వడ్డించడం సర్వసాధారణంగా మారింది. ఇటీవల కాలంలో పలు హోటళ్లు, స్వీట్‌షాపుల తనిఖీల్లో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించినప్పటికీ.. వారిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. దీంతో వ్యాపారులు మరింత రెచ్చిపోయి వినియోగదారుల ప్రాణాలతో ఆడుకుంటూ, అందినకాడికి దోచుకుంటున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు మామూళ్ల మత్తు వీడి, జిల్లాలోని తినుబండారాల వ్యాపార సామ్రాజ్యాలపై తక్షణమే మెరుపు దాడులు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
నిద్రమత్తులో ఫుడ్ సేఫ్టీ అధికారులు
ప్రొద్దుటూరులో పూరీ కూరలో
చనిపోయిన బల్లి కలకలం
కడపకు తుకారామ్ లాంటి అధికారి కావాలంటున్న ప్రజలు


