మైదుకూరు : రెవెన్యూ రికార్డుల్లో ఉన్న తరతరాలుగా సాగు చేసుకుంటున్న తమ భూమిని వీఆర్‌ఏ (గ్రామ రెవెన్యూ సహాయకుడు) సయ్యద్ సిలార్ అహమ్మద్ ప్రయత్నిస్తున్నాడని మైదుకూరు మండలం జాండ్లవరం గ్రామానికి చెందిన కోట నాగమునెమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. మంగళవారం ఆమె మైదుకూరులో తన కోడలు హేమతో కలిసి ఆ వివరాలను విలేకరులకు వివరించింది. బాల మునెమ్మ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నంద్యాలంపేట రెవెన్యూ పొలం సర్వే నంబర్ 1062లో 3.98 ఎకరాల భూమిని బాల మునెమ్మ భర్త కోట బాలనారాయణరెడ్డి ముదిజేజి కోట పోలక్క పేరుతో 1914 నుంచి 1956 వరకు ఆర్‌హెచ్‌లో ఉంది. ఆ తర్వాత సదరు భూమిని ఎవరికీ విక్రయించలేదు. క్రయ విక్రయాలు కూడా జరగలేదు. కాగా కొన్నాళ్ల కిందట తువ్వపల్లెకు చెందిన వీఆర్‌ఏ సిలార్ అహమ్మద్ తన కుటుంబ సభ్యుల పేరుతో ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకున్నాడు. ఆ విషయం తెలిసిన బాల మునెమ్మ, కుటుంబ సభ్యులతో కలిసి అప్పటి తహసీల్దార్ నాగేశ్వరరావుకు ఆన్‌లైన్‌లో సిలార్ అహ్మద్ కుటుంబ సభ్యుల పేరును తొలగించాలని విన్నవించింది. తహసీల్దార్ నాగేశ్వరరావు పొలాన్ని పరిశీలించగా నాగ మునెమ్మ ఆ పొలంలో కంది పంటను సాగు చేసి ఉంది. అయినా తహసీల్దార్ ఆన్‌లైన్ నుంచి సిలార్ అహమ్మద్ కుటుంబ సభ్యుల పేర్లను తొలగించలేదు. దీంతో నాగమునెమ్మ 2025లో కోర్టును ఆశ్రయించింది. కోర్టులో కేసు జరుగుతుండగానే సిలార్ అహమ్మద్ సర్వే నంబర్ 1062లోని భూమిలో అక్రమంగా బోర్ వేశాడు. ఓ పల్లె వద్ద ఉన్న తన భూమి సర్వే నంబర్ 1287/3 పేరుతో దరఖాస్తు చేసి సర్వే నంబర్ 1062 భూమిలో ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయించాడు. దానిపై నాగమునెమ్మ పలుమార్లు స్పందనలో ఫిర్యాదు చేసినా.. అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దాంతో విజిలెన్స్ వారికి ఫిర్యాదు చేసి జాయింట్ ఇన్‌స్పెక్షన్ చేయాలని కోరారు. ఆ మేరకు మండల సర్వేయర్, వీఆర్‌ఓ, విద్యుత్ లైన్‌మెన్ విజిలెన్స్ అధికారులు విచారణ చేసి సర్వే నంబర్ 1062లో అక్రమంగా ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసినట్లు నిర్ధారించి ట్రాన్స్‌ఫార్మర్‌ను తొలగించారు. కాగా సర్వే నంబర్ 1062లోని భూమిని అసైన్‌మెంట్ కమిటీ ద్వారా మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నామని, అది పరిశీలనలో ఉండగానే మండల తహసీల్దార్ సదరు భూమి నుంచి తమను బలవంతంగా ఖాళీ చేయించడానికి ప్రయత్నిస్తున్నారని ఈ ఏడాది ఆగస్టులో వీఆర్‌ఏ సిలార్ అహమ్మద్ కుటుంబ సభ్యుల పేరుతో కోర్టును ఆశ్రయించారు. భూమి విషయమై పిటిషనర్ జోలికి వెళ్లవద్దని జోక్యం చేసుకోవద్దని ఈ నెల 1న కోర్టు తహసీల్దార్‌ను ఆదేశించింది. అదే సమయంలో కోర్టు ఈ కేసును పూర్తిగా అంగీకరించడం లేదని పేర్కొంటూ, ఈ విషయమై నాగమునెమ్మకు నోటీసు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. కోర్టు భూమిని సాగు చేసుకోమని చెప్పిందని ఇప్పుడు తమ భూమిని దున్ని పండ్ల మొక్కలు నాటేందుకు సిలార్ అహమ్మద్ ప్రయత్నిస్తున్నాడని, అధికారులు తమకు న్యాయం చేయాలని నాగమునెమ్మ కోరింది.
జాండ్లవరం గ్రామానికి చెందిన మహిళ ఆవేదన


