ప్రొద్దుటూరు క్రైం : ‘ప్రజలారా.. మీ బ్యాంకు ఖాతాల్లోని డబ్బుకు భద్రత ఉందా ?.. ఒకసారి మీ ఖాతాలను చెక్ చేసుకోండి’ అంటూ ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ప్రజలకు సూచించారు. దొరసానిపల్లెలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం రాచమల్లు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బొందలకుంట సుబ్బరాయుడు అనే వ్యక్తి విద్యుత్‌శాఖలో పని చేస్తూ కొన్ని నెలల క్రితం ప్రమాదవశాత్తు మృతి చెందారన్నారు. ఆయనకు రావల్సిన బీమా మొత్తంలో సుమారు రూ. 11.51 లక్షలు టౌన్ బ్యాంక్‌లో జమ అయ్యాయని పేర్కొన్నారు. ఆ మొత్తాన్ని పొందేందుకు అర్హత కలిగిన వారసురాలు మృతుడి పెద్ద కుమార్తె సుచరిత అని అన్నారు. అయితే బ్యాంక్‌లో తన పేరుతో డబ్బు జమ అయిన విషయం ఆమెకు తెలియదని చెప్పారు. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న పట్టణంలోని టీడీపీ నాయకుడు, ప్రముఖ న్యాయవాది ఈవీ సుధాకర్‌రెడ్డి తనకు సంబంధించిన ఉషారాణి అనే మహిళను బ్యాంక్‌కు తీసుకెళ్లి సుచరితగా చూపించారన్నారు. అంతేకాకుండా సుచరితకు సంబంధించిన పాన్‌కార్డు, ఆధార్ కార్డులను ఇచ్చి, ఫొటో మాత్రం ఉషారాణివి ఇచ్చారని తెలిపారు. కొత్త ఖాతాదారుని పరిచయస్తుడి స్థానంలో ఈవీ సుధాకర్‌రెడ్డి సంతకం చేసి ఆమె పేరుతో 2025 సెప్టెంబర్ 20న అకౌంట్ ఓపెన్ (17393) చేయించినట్లు రాచమల్లు వెల్లడించారు. బ్యాంక్‌లో రూ.11.51 లక్షలు జమ అయిన తర్వాత ఈ ఏడాది మార్చి 9న ఉషారాణిని బ్యాంక్‌కు తీసుకెళ్లి రూ. 9 లక్షలు డ్రా చేశారని రాచమల్లు పేర్కొన్నారు. మరుసటి రోజు మరో రూ.2.51,500 డ్రా చేసిందని తెలిపారు. ఖాతాదారులకు చెందాల్సిన డబ్బును ఇతరులు వచ్చి ఫోర్జరీ సంతకాలతో డబ్బును కాజేసినట్లు రాచమల్లు ఆరోపించారు. టౌన్ బ్యాంక్ చైర్మన్‌గా ఆయన శిష్యుడు బొగ్గుల సుబ్బారెడ్డి ఉన్నాడనే ఉద్దేశ్యంతో సాక్షాత్తూ అధికార పార్టీ నాయకుడు ఈవీ సుధాకర్‌రెడ్డి ఈ చర్యలకు పాల్పడటం సిగ్గు చేటని రాచమల్లు విమర్శించారు. అధికార పార్టీ నాయకులే బ్యాంకింగ్ వ్యవస్థను దిర్వినియోగం చేస్తున్నారని తెలిపారు. ఇలా ఎంతో మందికి చెందిన ఇన్సూరెన్స్ డబ్బులు బ్యాంకులకు వస్తుంటాయని, ఎన్ని బ్యాంకుల్లో ఎన్ని మోసాలు చేశారో నిగ్గు తేల్చాల్సిన బాధ్యత ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డికి లేదా అని రాచమల్లు ప్రశ్నించారు.
ఖాతాలు చెక్ చేసుకోండి
ప్రస్తుత పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ తమ బ్యాంకు ఖాతాలను పరిశీలించుకోవాలని రాచమల్లు సూచించారు. తమకు తెలియకుండా ఏమైనా లావాదేవీలు జరిగాయా? అనుమానాస్పదంగా డబ్బులు డ్రా అయ్యాయా? అనే విషయాలను పరిశీలించుకోవాలని చెప్పారు. తమ పార్టీకి చెందిన కుమార్‌రెడ్డి 17 ఏళ్లు టౌన్ బ్యాంక్ చైర్మన్‌గా ఉంటూ ఉత్తమ సేవలు అందించారని గుర్తుచేశారు. అతని పాలనలో బ్యాంకు ఎంతో పురోభివృద్ధి సాధించినట్లు పేర్కొన్నారు. అలాంటి ఉత్తముడైన కుమార్‌ను టీడీపీ నాయకులు అన్యాయంగా తొలగించారన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై సంబంధిత బ్యాంకు అధికారులు, పోలీసులు సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయమై తాను ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. అవసరమైతే జ్యుడీషియల్ విచారణ కోరతానని చెప్పారు.
ఒకరి పేరుపై ఉన్న రూ.11.51 లక్షల బీమా సొమ్మును మరొక మహిళ పేరుతో డ్రా
టీడీపీ నాయకుల కనుసన్నల్లో ఘరానా మోసం
ఎమ్మెల్యే వరద ఎందుకు నోరు మెదపరు?
ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి


