ఖాకీ పక్షపాతం | - | Sakshi
Sakshi News home page

ఖాకీ పక్షపాతం

Sep 17 2026 12:14 AM | Updated on Sep 17 2026 12:14 AM

అధికార పార్టీ కనుసన్నల్లో పోలీసులు!

పులివెందులలో యథేచ్చగా టీడీపీ వర్గాల పరస్పర దాడులు

టీడీపీ నాయకుల ప్రోద్బలంతో గన్‌మెన్‌ కాల్పులు

గన్‌మెన్‌ కాల్పులపై విచారణ జరిగేనా..!

పోలీసుల తీరుపై పెదవి విరుస్తున్న ప్రజలు

సాక్షి టాస్క్‌ఫోర్స్‌ : వైఎస్సార్‌ కడప జిల్లా పులివెందుల పోలీసుల పనితీరు ‘‘నవ్విపోదురుగాక.. మాకేంటి సిగ్గు’’ అన్న చందంగా తయారైంది. సోమవారం అర్ధరాత్రి పులివెందులలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బీటెక్‌ రవి వర్గాలు రెండుగా విడిపోయి యథేచ్చగా దాడులు చేసుకున్న విషయం విదితమే. ఈ సంఘటన పులివెందుల పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం జరిగిన సంఘటనలో టీడీపీ నాయకులు పుష్పనాథరెడ్డి, అక్కులగారి విజయ్‌కుమార్‌రెడ్డి తమలో తామే కొట్టుకొని గన్‌మెన్‌తో కాల్పులు జరిపించినా పోలీసులు మాత్రం నో యాక్షన్‌ అన్నట్లుగా వ్యవహరించారు. దాడి సంఘటన పులివెందుల ప్రాంతంలో కలకలం సృష్టించింది. ఈ కేసు విషయంలో పోలీసుల పనితీరును రాజకీయ విశ్లేషకుల నుంచి సాధారణ ప్రజలు కూడా తీవ్రంగా తప్పుబడుతున్నారు.

పోలీసుల పనితీరు వివాదాస్పదం

సోమవారం అర్ధరాత్రి జరిగిన సంఘటనలో హజ్‌ కమిటీ డైరెక్టర్‌ మహబూబ్‌ బాషా గన్‌మెన్‌ రబ్బాని టీడీపీ నాయకుల ప్రోద్బలంతోనే కాల్పులు జరిపినట్లు స్పష్టంగా తెలుస్తోంది. కేవలం టీడీపీ నాయకుల ఒత్తిడి మేరకే గన్‌మెన్‌ గాలిలోకి కాల్పులు జరిపాడు. అయితే ఇందులో పోలీసుల పనితీరు వివాదస్పదంగా మారింది. జరిగిన సంఘటనలో టీడీపీ నాయకులు గన్‌మెన్‌పై తీవ్ర ఒత్తిడి చేయడంతోనే కాల్పులు జరిగాయి. పుష్పనాథరెడ్డి వర్గానికి చెందిన దాదాపు 100మంది అక్కుల గారి విజయ్‌కుమార్‌రెడ్డి ఇంటిపై దాడి చేయగా.. ఆ సమయంలో ఇంట్లో ఉన్న హజ్‌ కమిటీ డైరెక్టర్‌ మహబూబ్‌ బాషా ఆదేశాలతో గన్‌మెన్‌ కాల్పులు చేశాడు.

విచారణ జరిగేనా..!

సోమవారం జరిగిన ఘటనలో గన్‌మెన్‌ కాల్పులపై విచారణ జరిగే విషయం ప్రశ్నార్థకంగా మారింది. సాధారణంగా ప్రభుత్వ గన్‌మెన్‌ తన విధుల్లో భాగంగా కాల్పులు జరిపితే.. అందుకు సంబంధించి ఆర్డీఓ స్థాయి అధికారి సమక్షంలో ఎందుకు కాల్పులు జరిపావు.. ఏ సమయంలో జరిపావు.. ఎలాంటి పరిస్థితిలో జరపాల్సి వచ్చిందన్న విషయాలపై విచారణ జరపాల్సి ఉంది. చట్ట ప్రకారం ఈ పక్రియ కచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుంది. అయితే పులివెందులలో జరిగిన సంఘటనలో ఇలాంటి చట్టపరమైన విచారణ జరగలేదని తెలుస్తోంది.

చట్టాలు ఉన్నట్లా.. లేనట్లా

పులివెందులలో చట్టాలు ఉన్నట్లా.. లేనట్లా అన్నట్లు మారింది. గతంలో వైఎస్సార్‌ విగ్రహం చుట్టూ టీడీపీ జెండాలు తెలుగు తమ్ముళ్లు అత్యుత్సాహంతో కడితే.. వాటిని తొలగించారన్న నెపంతో వైఎస్సార్‌సీపీ నాయకులపై అక్రమంగా నాన్‌ బెయిలబుల్‌ కేసులు కట్టడమే కాకుండా థర్డ్‌ డిగ్రీ ప్రయోగించిన చరిత్ర పులివెందుల పోలీసులది. అయితే పులివెందులలో అర్ధరాత్రి రణరంగం సృష్టించిన టీడీపీ నాయకులపై ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపై పోలీసుల పనితీరుపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. వినాయక విగ్రహం వద్ద జరిగిన చిన్న సంఘటన చిలికి చిలికి గాలి వానలా మారి ఇరు వర్గాలవారు భీకరంగా దాడులు చేసుకోవడంతోపాటు వాహనాల ధ్వంసం చేశారు. అంతేకాకుండా టీడీపీ నాయకుని గన్‌మెన్‌ గాలిలో కాల్పులు కూడా చేశాడు. ఈ సంఘటనతో పులివెందుల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడటం జరిగింది. రాష్ట్రమంతా ఈ సంఘటన ఓ సంచలనంగా మారింది. కానీ పులివెందుల పోలీసులకు మాత్రం ఈ సంఘటన ఒక చిన్న విషయంగా కనిపించడం గమనార్హం. గతంలో వైఎస్సార్‌ విగ్రహానికి టీడీపీ జెండాలు కట్టవద్దు అన్నందుకు పులివెందుల మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ వరప్రసాద్‌తో సహా 18మందిని అరెస్టు చేసి థర్డ్‌ డిగ్రీ ప్రయోగించి జైలుకు పంపిన పోలీసులు టీడీపీ వారికి మాత్రం కేవలం 41ఏ నోటీసులు ఇచ్చి వదిలేయడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు ఎలాంటి తప్పు చేయకున్నా.. ఒంటి కాలిపై వస్తున్న అధికారులు.. ఓ దళిత మాజీ కౌన్సిలర్‌ కిశోర్‌పై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించడం, అతను జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు వెళ్లడంతో పులివెందుల డీఎస్పీకి తాఖీదులు వచ్చాయి. తమ సొంత వివాదాల్లో కాల్పులు జరపాల్సిందిగా గన్‌మెన్‌కు ఆదేశాలు ఇచ్చి టీడీపీ నాయకులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న పులివెందుల పోలీసులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.

పోలీసుల తీరుపై అసంతృప్తి

పులివెందుల పోలీసుల పనితీరుపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పులివెందుల ప్రాంతంలో యథేచ్చగా మట్కా, జూదాలతోపాటు అక్రమ మైనింగ్‌, అక్రమ ఇసుక రవాణా సాక్షాత్తూ ప్రభుత్వ అధికారుల కన్నుసన్నల్లోనే టీడీపీ నాయకులు దోచుకుంటున్నారు. అయినా ప్రభుత్వ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. పులివెందుల సబ్‌ డివిజనల్‌ స్థాయి అధికారికి వైఎస్సార్‌సీపీ నాయకులపై విరుచుకుపడటం అలవాటుగా మారింది. వినాయక చవితి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డివిజనల్‌ స్థాయి అధికారి మాట్లాడుతూ వినాయక మండపాల వద్ద గొడవలకు పాల్పడితే వారిపై పీడీ యాక్ట్‌ నమోదు చేస్తామని మీడియా సాక్షిగా హెచ్చరించారు. అయితే సోమవారం వినాయక మండపం సాక్షిగా జరిగిన టీడీపీ నాయకుల గొడవపై ఎలాంటి కేసులు నమోదు చేయకపోవడం పట్ల ఆయన పనితీరుపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. పులివెందుల పోలీసులు చెప్పేదొకటి.. చేసేదొకటి అన్న చందంగా మారింది. పోలీసుల పనితీరు మీడియా సమావేశాలకు మాత్రమే పరిమితమైంది. ఆచరణలో మాత్రం అధికార పార్టీ నాయకుల ఆదేశాలను పాటించడమే తమ కర్తవ్యంగా మారిందని చెప్పవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement