రూ. 2.80 లక్షలు పలికిన ప్రసాదం
ఖాజీపేట : మండలంలో గణపతి లడ్డూ వేలం అ‘ధర’హో అన్నట్లుగా సాగింది. త్రిపురవరం గ్రామంలో నెలకొల్పిన గణేశుడి లడ్డూ దక్కించుకునేందుకు పోటాపోటీగా పాల్గొన్నారు. రూ. 2.80 లక్షలు వేలం పాటలో పాడి మీగడ హరి కేశవరెడ్డి స్వామి వారి ప్రసాదాన్ని దక్కించుకున్నారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని మూడు రోజులగా పూజలు అందుకున్న గణనాథులను బుధవారం నిమజ్జనం చేశారు. అలాగే మండలంలో లంబోదరుడి లడ్డూలను దక్కించుకోవడం కోసం భక్తులు ఉత్సాహం చూపారు.
కడప ఎడ్యుకేషన్: జిల్లా స్థాయి సైన్సు సెమినార్‌లో జిల్లాకు చెందిన విద్యార్థులు ప్రతిభ చాటారు. కడప చెన్నూరు బస్‌స్టాండ్ సమీపంలోని జిల్లా సైన్స్ సెంటర్‌లో బుధవారం జిల్లా సైన్సు అధికారి లేబాక బాలాజీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సైన్స్ సెమినార్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో కడప నక్కాస్ ఉర్దూ మున్సిపల్ హైస్కూల్‌కు చెందిన 9వ తరగతి విద్యార్థి హిఫాతుజాల్లా ప్రథమ బహుమతిని సాధించగా, సిద్దవటం మండలం టక్కోటి జెడ్పీ హైస్కూల్‌లో పదో తరగతి చదువుతున్న రెడ్డెమ్మ ద్వితీయ స్థానంలో నిలిచింది. డీఈఓ షేక్ షంషుద్దీన్ విజేతలను అభినందిస్తూ 22న జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
చెన్నూరులో స్వల్ప ఉద్రిక్తత
చెన్నూరు(వల్లూరు): మండల కేంద్రమైన చెన్నూరులో గణేష్ నిమజ్జనం సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం చెన్నూరులోని తూర్పు హరిజనవాడలో నిమజ్జనం నేపథ్యంలో డీజే ఏర్పాటు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు డీజేలకు అనుమతులు లేదని, నిబంధనలకు లోబడి నిమజ్జనం నిర్వహించుకోవాలని హెచ్చరించారు. దీంతో డీజే నిర్వాహకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే కాలనీకి చెందిన వారు డీజే లేకుండా ఇక్కడి నుంచి కదలమని రోడ్డుపై బైఠాయించారు. పరిస్థితిని సీఐ చాంద్ బాషా ద్వారా తెలుసుకున్న డీఎస్పీ బాలస్వామిరెడ్డి అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. వెంటనే కడప నుంచి అదనపు పోలీసు బలగాలను రప్పించారు. అనంతరం స్థానిక నాయకుల జోక్యంతో ఇతరులకు ఇబ్బందులు లేకుండా డీజేను కొసాగించేలా నిమజ్జన గ్రామోత్సవానికి అనధికారికంగా అనుమతించారు. ఎట్టకేలకు నిమజ్జనం సజావుగా సాగింది. కాగా చివరి దశలో మద్యం మత్తులో యువకుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.


