● చవితి ఉత్సవాల్లో ఆర్కెస్ట్రా
● స్టెప్పులేసిన నాయకులు
సాక్షి టాస్క్ ఫోర్స్ : ఒంటిమిట్ట మండలంలోని రాచగుడిపల్లెలో వినాయక మండపం వద్ద మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన ఆర్కెస్ట్రా వివాదాస్పదంగా మారింది. వినాయక ఉత్సవాల సందర్భంగా మండపం వద్ద నిర్వహించిన ఆర్కెస్ట్రాలో అమ్మాయిలతో అసభ్యకర నృత్యాలు వేయించడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు డాన్స్ వేస్తున్న యువతులతో స్థానిక టీడీపీ నాయకుడు, రాజంపేట నియోజకవర్గానికి సంబంధం లేని మరో టీడీపీ నాయకుడితో కలిసి వేదికపై స్టెప్పులేశారు. అయితే ఆర్కెస్ట్రా డాన్స్ నిర్వహించేందుకు సంబంధిత అధికారుల నుంచి అనుమతులు తీసుకోలేదని స్థానికంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన ఒక నాయకుడి అండదండలు ఉండటంతోనే ఆర్కెస్ట్రా కార్యక్రమానికి పోలీసులు సహకరించినట్లు విమర్శలు ఉన్నాయి.
ఆర్కెస్ట్రాకు అనుమతి లేదు
మంగళవారం రాత్రి రాచగుడిపల్లిలో జరిగిన ఆర్కెస్ట్రాకు ఎలాంటి అనుమతి లేదని ఒంటిమిట్ట ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే సిబ్బందితో వెళ్లి కార్యక్రమాన్ని నిలిపేశారు. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించిన వారిపై శాఖ పరమైన చర్య తీసుకుంటామని పేర్కొన్నారు.


