● జిల్లాలో వేసవిని తలపిస్తున్న ఎండలు
● ఉక్కతో అల్లాడుతున్న జనం
● వర్షాభావ పరిస్థితులతో
రైతుల్లో అందోళన
● మారిన వాతావరణంలో
జనాలకు జలుబు, జ్వరాలు
తేదీ కనిష్ట గరిష్ట గాలివేగం
ఉష్ణోగ్రత ఉష్ణోగ్రత (కి.మీ/
(డిగ్రీలు) (డిగ్రీలు) గంటకు)
01.9.26 27.8 36.6 8.1
02.9.26 26.2 36.2 5.5
03.9.26 28.2 36.6 7.9
04.9.26 28.6 37.2 5.6
05.9.26 28.4 38.6 7.2
06.9.26 28.7 38.9 5.9
07.9.26 28.0 39.2 4.3
08.9.26 27.6 38.2 6.4
కడప అగ్రికల్చర్: ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వాతావరణంలో చోటుచేసుకుంటు న్న విభిన్న మార్పులు జిల్లా ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కొద్దిసేపు ఆకాశమంతా మేఘావృతమవ్వడం, మరికొద్ది సేపటికే ఎండలు తీవ్రంగా కాయడంతో జిల్లా ప్రజ లు అల్లాడిపోతున్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి వింత వాతావరణాన్ని చూడలేదని పలువురు పేర్కొంటున్నారు. అటు ప్రకృతి కరుణించక, ఇటు వింత వాతావరణ పరిస్థితులతో జిల్లా అంతటా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.
ముఖం చాటేసిన వరుణుడు..
ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వాన దేవుడు పూర్తిగా ముఖం చాటేశాడు. దీంతో రోజురోజుకూ ఎండల తీవ్రత గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుత పరిస్థితులు మండు వేసవిని తలపిస్తున్నాయి. నాలుగు రోజులు గా జిల్లాలో ఉష్ణోగ్రతలు బాగా పెరగడంతో పాటు, పగలు రాత్రి తేడా లేకుండా ఉక్కపోత వేధిస్తోంది. దీంతో జనాలు ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చిన్నా రులు, వృద్థులు అవస్థలు పడుతున్నారు.
39 డిగ్రీలకు చేరిన భానుడి భగభగలు
గత వారం రోజులుగా జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. సెప్టెంబర్ 1న 36.6 డిగ్రీలుగా ఉన్న గరిష్ట ఉష్ణోగ్రత, కేవలం వారం రోజుల్లోనే అంటే సెప్టెంబర్ 7 నాటికి 39.2 డిగ్రీలకు చేరుకుంది. పగటి ఉష్ణోగ్రతలతో పాటు రాత్రి వేళల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు 28 డిగ్రీ ల పైనే నమోదు కావడంతో ఉక్కపోత తీవ్రరూపం దాల్చింది.
వాతావరణంలో చోటుచేసుకున్న ఈ ఆకస్మిక మార్పుల వల్ల ప్రజలు జలుబు, దగ్గు, తీవ్ర జ్వరాల బారిన పడుతున్నారు. అనారోగ్య సమస్యలతో జనం సతమతమవుతూ ఆసుపత్రుల బాట పడుతున్నారు. ఒకవైపు చేతిలో పనులు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే, మరోవైపు రోగాల బారిన పడుతుండటంతో వైద్య ఖర్చులు భరించలేక సామాన్యులు విలవిలలాడుతున్నారు.ముందుకు సాగని వ్యవసాయం.. బోర్లలో సైతం అడుగంటిన నీరువర్షాలు లేని కారణంగా జిల్లాలో వ్యవసాయ పనులు పూర్తిగా ముందుకు సాగడం లేదు. ఫలితంగా వ్యవసాయ కూలీలకు పనులు దొరకక పూట గడవడం కష్టంగా మారింది. వ్యవసాయ బోర్లలో నీటి ప్రవాహం గణనీయంగా క్షీణించిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి, కరువు ప్యాకేజీ ప్రకటించి జిల్లా రైతాంగాన్ని ఆదుకోవాలని రైతు సంఘాల నాయకులు, రైతులు డిమాండ్ చేస్తున్నారు.


