అదిగో.. మహిళా లోకానికి ఉచిత ప్రయాణాలంటూ కూటమి సర్కారు పెద్ద పెద్ద హామీల ‘ఫ్రీ బస్సు’ ఎక్కించేసింది! ఇంకేముంది.. సీట్లు దొరక్క బస్సుల్లో సిగపట్లు, జుట్టు పట్లు ఎలాగూ నిత్యకృత్యం అయిపోయాయి. కానీ, అసలు ట్విస్ట్ ఇక్కడ కాదు బాసూ.. బస్సు స్టాప్‌లో చేతులు ఎత్తితే ఆపకుండా తుర్రున వెళ్లిపోయే ఆర్టీసీ డ్రైవర్లను దాటుకుని, ఎట్టకేలకు సీటు సంపాదిస్తే.. ఆ బస్సే నడిరోడ్డుపై మొరాయిస్తే ఆ అగచాట్లు ఎలా ఉంటాయో మంగళవారం సాయంత్రం వైఎస్సార్ కడప జిల్లా సింహాద్రిపురం రూట్లో సాక్షాత్కరించింది. పులివెందుల నుంచి తాడిపత్రికి వెళ్లే ఆర్టీసీ బస్సు కాస్తా మధ్యలో మొండికేసి ‘నేను కదలను గాక కదలను’ అంటూ మొరాయించింది. ఇంకేముంది.. డ్రైవర్, కండక్టర్ చేతులెత్తేయడంతో.. విధిలేని పరిస్థితుల్లో ‘ఉచిత’ ప్రయాణికురాళ్లే రంగంలోకి దిగారు. తమ చేతులకు ఉన్న గాజుల సవ్వడి పక్కనబెట్టి.. చీరల కొంగులు నడుముకు చుట్టి.. ఆర్టీసీ బస్సును స్టార్ట్ చేయడానికి వెనుక నుంచి గట్టిగా తోయాల్సి వచ్చింది! ‘ఫ్రీ బస్సంటే.. ఏదో సీట్లు మాత్రమే ఫ్రీ అనుకున్నాం సార్, కానీ ఇలా బస్సును తోసే ‘ఫ్రీ వ్యాయామం’ కూడా ఇస్తారని ఊహించలేదు’ అంటూ తోసి తోసి అలసిపోయిన మహిళలు వ్యంగ్యంగా ముక్కున వేలేసుకుంటున్నారు. ఫ్రీ టికెట్ ఇచ్చారు సరే.. కాస్త నడిచే బస్సులను కూడా ఇస్తే పుణ్యం ఉంటుందని కూటమి సర్కారుకు మహిళా లోకం దండాలు పెడుతోంది. – సింహాద్రిపురం


