నల్లని మబ్బుల నడుమ.. సాయంసంధ్య వేళ.. ఆకాశమంతా ఒకేసారి బంగారు రంగుతో మెరిసిపోతే ఆ అనుభూతి వర్ణనాతీతం! మంగళవారం సాయంత్రం జమ్మలమడుగులో సరిగ్గా అలాంటి అద్భుత దృశ్యమే ఆవిష్కృతమైంది. రోజంతా తన వేడి కిరణాలతో ఉక్కిరిబిక్కిరి చేసిన భానుడు.. పడమటి కొండల్లోకి వాలిపోతూ జమ్మలమడుగు ఆకాశంపై పసిడి పారాణి పూశాడు. తెల్లని మేఘాల పొరలు ఒక్కసారిగా స్వర్ణమయంగా మారిపోవడంతో ప్రకృతి ఒక అందమైన కాన్వాస్ లా రూపాంతరం చెందింది. స్థానిక దర్గా గుమ్మటం, దానిపై రెపరెపలాడుతున్న పతాకాల వెనుక సూర్యాస్తమయ కిరణాలు వెదజల్లిన ఆ ‘స్వర్ణవర్ణశోభ’ చూసి స్థానికులు పరవశించిపోయారు. అప్పటివరకు గజిబిజి పనుల్లో ఉన్నవారంతా ఒక్క నిమిషం పాటు ఆగి, ఆకాశం వైపు ముగ్ధులై చూస్తూ ఉండిపోయారు. ప్రకృతే స్వయంగా కురిపించిన ఈ కనక వర్షపు అపురూప దృశ్యాన్ని చాలా మంది తమ మొబైల్ ఫోన్లలో ఫొటోలుగా, వీడియోలుగా బంధించి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. కాసేపు ప్రకృతి రమణీయతను ఆస్వాదించిన జమ్మలమడుగు ప్రజలు, సాయంత్రపు ఉక్కపోతను మరిచి ఈ దృశ్యంతో మనసులను తేలిక పరుచుకున్నారు. – జమ్మలమడుగు


