స్మార్ట్‌ కిచెన్లకు జాతీయ స్థాయి గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌ కిచెన్లకు జాతీయ స్థాయి గుర్తింపు

Sep 9 2026 3:04 AM | Updated on Sep 9 2026 3:04 AM

చెన్నూరు (వల్లూరు) : వైఎస్సార్‌ కడప జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్‌ కిచెన్‌ (ఆధునిక వంటశాల) ప్రాజెక్టుకు జాతీయస్థాయిలో విశేష గుర్తింపు వచ్చిందని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ అన్నారు. చెన్నూరు మండలం కొండపేట గ్రామంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన స్మార్ట్‌ కిచెన్‌ పనితీరును, అక్కడ అమలవుతున్న మధ్యాహ్న భోజన పథక నిర్వహణను పరిశీలించేందుకు అంతర్జాతీయ సంస్థ ‘జైకా‘ జపాన్‌ ప్రతినిధి యామికోశాన్‌, హెల్త్‌ అండ్‌ న్యూట్రీషియన్‌ టీం లీడర్‌ మోహిత్‌ తో కూడిన బృందం మంగళవారం ఇక్కడకు విచ్చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ స్వయంగా కిచెన్‌ ప్రత్యేకతలు, రుచి, శుచికరమైన భోజనం అందించే తీరు, రవాణా జాగ్రత్తలను జపాన్‌ బృందానికి వివరించారు. అనంతరం చెన్నూరు బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించిన అధికారులకు విద్యార్థినులు జపాన్‌ భాషలోనే స్వాగతం పలకడం అందరినీ ఆకట్టుకుంది. విద్యార్థుల పరిశుభ్రత అలవాట్లు, క్రమశిక్షణను కలెక్టర్‌తో పాటు జాయింట్‌ కలెక్టర్‌ నిధి మీనా విదేశీ బృందానికి వివరించారు. అనంతరం మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించేందుకు జపాన్‌ ప్రతినిధులు, కలెక్టర్‌, జేసీలతో కలిసి విద్యార్థులతో సహపంక్తి భోజనంలో పాల్గొన్నారు. అనంతరం ‘జైకా’ ప్రతినిధి యామికోశాన్‌ విలేకరులతో మాట్లాడుతూ.. జపాన్‌ లోని పాఠశాలల వలె ఇక్కడ కూడా పరిస్థితులు ఎంతో బాగున్నాయని.. పిల్లల్లో పరిశుభ్రత, పౌష్టికాహార అమలు తీరు తమకు ఎంతో సంతృప్తిని ఇచ్చాయని ప్రశంసించారు. కలెక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా 1,900 పాఠశాలల్లో దాదాపు 75,000 మంది విద్యార్థులకు స్మార్ట్‌ కిచెన్‌ ద్వారా నిత్యం ఆహారాన్ని అందిస్తున్నట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో డీఈవో షంషుద్దీన్‌, ఆర్డీవో మురళి, డీఆర్‌డీఏ పీడీ రాజ్యలక్ష్మి, తహసిల్దార్‌ విజయకుమారి, ఇన్‌చార్జి ఎంపీడీవో వరప్రసాద్‌ రెడ్డి, ఎంఈఓలు జే. సునీత, ఎన్‌. సునీతలు, పీఆర్‌ ఏఈ విష్ణువర్ధన్‌ రెడ్డి, ఏపీవో వెంకటేష్‌, హెచ్‌ఎం రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు.

వైద్య సేవలపై శాసన మండలి కమిటీ సమీక్ష

కడప అర్బన్‌ : కడప కలెక్టరేట్‌లో మంగళవారం ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వైద్య సేవలు, ఆసుపత్రుల అభివృద్ధిపై ఉన్నతాధికారుల సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వైద్య విద్యా సంచాలకులు డాక్టర్‌ ఎ.విష్ణువర్ధన్‌, సంయుక్త సంచాలకులు గణపతిరావు హాజరయ్యారు. సమీక్షకు ముందు వారు కడప రిమ్స్‌ ప్రాంగణంలోని సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి, మానసిక ఆరోగ్య సంస్థ, క్యాన్సర్‌ చికిత్స కేంద్రాలను సందర్శించి రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు. అనంతరం కడప సర్వజన ఆసుపత్రిలో ఎల్‌ఐసీ సీఎస్‌ఆర్‌ నిధుల ద్వారా సమకూర్చిన ఆధునిక రేడియాలజీ పరికరాన్ని తనిఖీ చేసి, దానిని ప్రజలకు సమర్థంగా వినియోగించాలని సూచించారు. అనంతరం విభాగాధిపతులతో సమావేశమై ఆసుపత్రుల్లో సేవల నాణ్యత, మౌలిక సదుపాయాల మెరుగుదలకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కె.పెంచలయ్య, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పద్మజారాణి, వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ విజయభాస్కర్‌రెడ్డి, ఏఓ యు.రంగస్వామి, ఆర్‌ఎమ్‌ఓలు డాక్టర్‌ వై.శ్రీనివాసులు, డాక్టర్‌ ఎస్‌.ఆర్‌.రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి

కడప జిల్లా ఆధునిక వంటశాలను సందర్శించిన ‘జైకా’ జపాన్‌ ప్రతినిధుల బృందం

జపనీస్‌ భాషలో స్వాగతం పలికి, అధికారులతో కలిసి సహపంక్తి భోజనం

చేసిన విద్యార్థినులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement