వేముల : మండలంలోని చాగలేరు ఎస్సీ కాలనీలో మంగళవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కాలనీకి చెందిన చాగలేటి రవి శంకర్ కిరాణా బంకు పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. అక్కడ బంకు వద్దనే బోధ కొట్టం నిర్మించుకుని ఉంటున్నాడు. మంగళవారం బంకులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగడంతో బంకుతోపాటు అందులోని కిరాణా సరుకులు కాలి బూడిదయ్యాయి. అలాగే వ్యవసాయ పనుల కోసం బోధ కొట్టంలో నిల్వ ఉంచుకున్న వ్యవసాయ సామగ్రి కాలిపోయింది. తన పొలంలో సాగు చేసిన ఉల్లికి రసాయనిక ఎరువు కొనుగోలు చేసి బోధ కొట్టంలోనే పెట్టాడు. అగ్ని ప్రమాదం జరగడంతో రసాయనిక ఎరువులు, సాగునీరు అందించేందుకు తెచ్చుకున్న పీవీసీ పైపులు కాలిపోవడంతో బాధితుడు లబోదిబోమంటున్నాడు. సుమారు రూ.2.50 లక్షల నష్టం వాటిల్లినట్లు వాపోయాడు. మంటలను ఆర్పేందుకు గ్రామస్తులు ప్రయత్నించినా మంటలు వేగంగా వ్యాపించడంతో కిరాణా బంకు, వ్యవసాయ వస్తువులు కాలిపోవడంతో తీవ్రంగా నష్టపోయాడు.


