గోపవరం : బద్వేలు నియోజకవర్గం గోపవరం మండలంలోని టీడీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. రితీష్‌రెడ్డి, సూర్యనారాయణరెడ్డి ఇద్దరి మధ్య సయోధ్య కుదరకపోవడంతో రోజురోజుకు వర్గ విభేదాలు ముదురుతున్నాయి. తమకు సమాచారం లేకుండానే పార్టీ కార్యక్రమాలు మండలంలో చేపడుతుండటంపై నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి సూర్యనారాయణరెడ్డిపై రితీష్‌రెడ్డి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో తనపై జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన వేణుగోపాల్‌రెడ్డిని ఏ విధంగా పార్టీలో చేర్చుకుంటారని జెడ్పీటీసీ జయరామిరెడ్డి పార్టీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై దాడి చేసి అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టాడని, ఇప్పుడు అటువంటి వ్యక్తిని పార్టీలో చేర్చుకోవడంపై తాను పూర్తిగా విబేధిస్తూ రాజీనామా కూడా చేసేందుకు సిద్ధపడినట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. అలాగే బీసీ యాదవ మహిళను కాబట్టే తనకు తెలియకుండానే పార్టీ కార్యక్రమాలు చేపడుతున్నారని ఎంపీపీ ధనలక్ష్మి ఆరోపిస్తున్నారు. ఇటీవల మండలంలోని ఎస్.రామాపురం, రాచాయపేట, బ్రాహ్మణపల్లె గ్రామాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో కూడా పార్టీ తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఆమె ఆరోపించారు. జెడ్పీటీసీ జయరామిరెడ్డితోపాటు తాను కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఒకటి, రెండు రోజుల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి జెడ్పీటీసీ, ఎంపీపీ ఇద్దరూ కూడా రాజీనామా చేయనున్నట్లు తెలిపారు.
ఢీకొన్న బస్సు, కారు
ముద్దనూరు : ముద్దనూరు–కడప ప్రధాన రహదారిలో ముద్దనూరు సమీపంలోని డాబా వద్ద బళ్ళారి నుంచి కడపకు ప్రయాణిస్తున్న కర్ణాటక బస్సు, కారు ఢీకొన్నాయి. ప్రయాణికుల సమాచారం మేరకు.. కడపకు ప్రయాణిస్తున్న బస్సు ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి అదుపుతప్పి పక్కన పొలాల్లోకి దూసుకెళ్లింది. అయితే కొంత వరకు ఢీనడంతో కారు ముందు భాగం దెబ్బతినింది. అదృష్టవశాత్తు ఎవరికీ ప్రమాదం సంభవించలేదు. ఈ ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 19 మంది ప్రయాణికులు వున్నారు.
పిచ్చికుక్క స్వైరవిహారం
పోరుమామిళ్ల : పట్టణంలో గత రెండు రోజులుగా పిచ్చికుక్క కాటుతో 20 మందికి పైగా ఆసుపత్రి పాలయ్యారు. జడ్పీటీసీ ముత్యాల ప్రసాద్ మాట్లాడుతూ చితానందనగర్, శ్రీరాంనగర్, రంపాడురోడ్, బెస్తవీధి ప్రాంతాల్లో కుక్కల దాడులతో చాలామంది గాయపడ్డారని, వెంటనే కుక్కలను అదుపు చేయాలని కోరారు. శ్రీరాంనగర్‌కు చెందిన జమీరాయాసిన్ (6), చితానందనగర్‌కు చెందిన రామచంద్రయ్య (65), రామకృష్ణ (45),ప్రణతి, స్టార్ స్కూల్ వద్ద ఉన్న మహబూబ్‌బాష(65), గురప్ప తదితరులు ఆసుపత్రుల్లో చేరారన్నారు.
● తమకు సమాచారం లేకుండానే కార్యక్రమాల నిర్వహణపై ఆగ్రహం
● రాజీనామా దిశగా జెడ్పీటీసీ, ఎంపీపీ


