వైఎస్సార్‌సీపీ నేతలపై ఆది అనుచరుల దాడి | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ నేతలపై ఆది అనుచరుల దాడి

Sep 9 2026 3:04 AM | Updated on Sep 9 2026 3:04 AM

ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా కొట్టిన ఎమ్మెల్యే అనుచరులు

ఇద్దరికి తీవ్ర గాయాలు

నిందితుల్ని అరెస్ట్‌ చేయకుంటే ఆందోళన తప్పదన్న మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి

జమ్మలమడుగు/ఎర్రగుంట్ల : వైఎస్సార్‌ కడప జిల్లా ఎర్రగుంట్ల ఇందిరానగర్‌ పుష్పగిరి ప్రాంతానికి చెందిన వైఎస్సార్‌సీపీ నేతలు డేరంగుల శ్రీనివాసులు, డేరంగుల గోపిపై ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అనుచరులు ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. నాపరాయి పాలిష్‌ మెషిన్‌ నడుపుకుంటున్న శ్రీనివాసులుకు, సమీపంలో విద్యుత్‌ స్తంభం ఏర్పాటు చేసే విషయమై అదే ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అనుచరుడు గంగాధర్‌రెడ్డి, అతని కుమారుడు విక్రమ్‌ కుమార్‌రెడ్డితో కొన్ని నెలల క్రితం వివాదం తలెత్తింది. దీంతో ఎమ్మెల్యే అనుచరులు మంగళవారం ఇనుపరాడ్లతో శ్రీనివాసులు, గోపిల తలలపై కొట్టి తీవ్రంగా గాయపరిచారు. కులం పేరుతో దూషించి బూతులు తిడుతూ విచక్షణారహితంగా దాడి చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. క్షతగాత్రులను స్థానికులు ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ మూలే సుధీర్‌రెడ్డి ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి నేతలు అధికారం అండతో బలహీనులపై దాడులు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. వైఎస్సార్‌సీపీకి విధేయులుగా ఉన్న వడ్డెర కులస్తులను భయభ్రాంతులకు గురిచేస్తే తగిన గుణపాఠం చెబుతామన్నారు. పోలీసులు వెంటనే స్పందించి నిందితులను అరెస్ట్‌ చేయాలని, లేనిపక్షంలో వడ్డెర కులస్తులతో కలిసి పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు. ఈ ఘటనపై ఎర్రగుంట్ల సీఐ విశ్వనాథరెడ్డిని వివరణ కోరగా.. గొడవ జరిగిన విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు సమగ్ర విచారణ జరిపి నిందితులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement