చింతకొమ్మదిన్నె : కడప– రాయచోటి జాతీయ రహదారిలోని వైయస్సార్ కడప – అన్నమయ్య జిల్లాల సరిహద్దులో సోమవారం రాత్రి గువ్వలచెరువు ఘాట్‌లోని లోయలో పడి లారీ అగ్నికి ఆహుతి కాగా, ఆ మంటల్లో ఇద్దరు లారీ డ్రైవర్లు సజీవ దహనం అయిన విషయం తెలిసినదే. అయితే ఈ ప్రమాదానికి లారీ అతివేగమే కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీఎన్52 కే 9788 నెంబర్ గల లారీ సోమవారం తమిళనాడులోని రాణిపేట నుండి లక్నోకు పెయింట్లలో ఉపయోగించే కెమికల్ పౌడర్‌తో బయలుదేరినది. సరిగ్గా వైఎస్‌ఆర్ కడప–అన్నమయ్య జిల్లా సరిహద్దులోని గువ్వలచెరువు ఘాట్ రోడ్డులో ఆరవ మలుపు వద్ద రక్షణ గోడను ఢీకొని లోయలో పడటంతో లారీకి మంటలు అంటుకొని పూర్తిగా కాలిపోవడంతో, అందులోని ఇద్దరు డ్రైవర్లు సజీవదహనం అయ్యారు. మృతులు తమిళనాడు రాష్ట్రంలోని క్రిష్ణగిరి జిల్లాకు చెందిన డ్రైవర్ పళని కృష్ణన్ (56)కు భార్యతోపాటు పళని, నితీష్, నవీన్, పరిమళ అనే నలుగురు సంతానం ఉన్నారు. అదే విధంగా తాత్కాలిక డ్రైవర్ అయిన సుబ్రమనణి చిన్నస్వామి(40)కి భార్యతోపాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరు ఇరువురు తమిళనాడు రాష్ట్రంలోని బాలకృష్ణ ట్రాన్స్‌పోర్టులో డ్రైవర్లుగా పని చేస్తూ కుటుంబాల్ని పోషిస్తున్నారు. అయితే ఇద్దరూ లారీ అగ్ని ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. మంగళవారం ఉదయం కూడా లారీ నుంచి మంటలు వస్తుండడంతో మరోసారి ఫైర్ ఇంజన్‌తో మంటలను ఆర్పి వేశారు. సంఘటనా స్థలాన్ని మంగళవారం చింతకొమ్మదిన్నె ఎస్‌ఐ శ్రీనివాసులురెడ్డి, ఆర్ అండ్ బి అధికారులు పరిశీలించారు. లారీ డ్రైవర్లు కొందరు డీజిల్ ఆదా కోసం లారీని న్యూట్రల్లో నడపడంతో కూడా మలుపుల వద్ద బ్రేకులు ఫెయిలై వాహనాలు ఘాట్లోని లోయలో పడి మత్యువాత పడుతున్నారు.
సంఘటనా స్థలంలోనే పోస్టుమార్టం
లారీ అగ్నికి ఆహుతి కావడంతో జరిగిన ప్రమాదంలో సజీవ దహనమైన పళని కృష్ణన్ సుబ్రహ్మణ్యం మృతదేహాలకు సంఘటనా స్థలంలోని రిమ్స్ వైద్యులు పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు.
సంఘటనా స్థలంలోనే మృతదేహాలకు
పోస్టుమార్టం


