అంజన్న దర్శనం.. క్యూలైన్ల ప్రహసనం! | - | Sakshi
Sakshi News home page

అంజన్న దర్శనం.. క్యూలైన్ల ప్రహసనం!

Aug 30 2026 12:45 AM | Updated on Aug 30 2026 12:45 AM

భక్తులతో కిక్కిరిసిన గండి క్షేత్రం

అస్తవ్యస్తంగా ఏర్పాట్లు

అధికారుల తీరుపై విమర్శలు

చక్రాయపేట : పవిత్ర పుణ్యక్షేత్రమైన గండి వీరాంజనేయస్వామి సన్నిధి శ్రావణ మాసం మూడవ శనివారోత్సవం సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. జిల్లా నలుమూలల నుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచి సైతం పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వామిని దర్శించుకున్నారు. అయితే క్యూలైన్ల ఏర్పాటులో అవగాహన లేమితో స్వామి రూపం కనిపించలేదని పలువురు భక్తులు ఆవేదన చెందారు. ముఖ్యంగా వీఐపీలు, వంద టికెట్‌ కొన్న భక్తులను ముందు వరుసలో నిలిపి పూజలు చేయించే ఏర్పాటు చేశారు. దీంతో వంద టికెట్‌ కొని వెళ్లిన భక్తులకు స్వామి కనిపించక మునుపే రద్దీని దృష్టిలో ఉంచుకొని బయటికి తోసేస్తున్నట్లు పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. వీఐపీలు, వంద టికెట్‌ తీసుకున్న వారు అడ్డుగా ఉండటంతో, రూ.50 టికెట్‌ కొన్న వారికి కూడా స్వామి విగ్రహం కనిపించక వారి మనోభావాన్ని దెబ్బతీసింది. సాధారణ దర్శనం క్యూలో వెళ్లిన భక్తులు చెప్పలేనన్నీ ఇబ్బందులు పడ్డారు. పైరవీలతో వెళ్లిన వారిని వీఐపీ అని మధ్యలో నుంచి పంపి ఇబ్బందులు కలిగించారని.. వంద టికెట్‌ కొన్న వారు ఆలయ వర్గాలపై విమర్శలు గుప్పించారు. దీంతో ఏర్పాట్ల విషయంలో అధికారులు పూర్తిగా విఫలమైనట్లు సర్వత్రా విమర్శలు వినిపించాయి. ప్రొటోకాల్‌ కలిగిన వీఐపీలు, రూ.వంద టికెట్‌ కొన్న వారు ఒకే క్యూలైన్‌లోనే వెళ్లాల్సిన పరిస్థితి ఇక్కడ కనిపించింది.

పూజల్లోనూ పైరవీలకే ప్రాధాన్యం

దర్శనానికి వచ్చిన భక్తుల్లో పైరవీలు కలిగిన వారికే ప్రాధాన్యత ఇవ్వడం పలువురికి ఆగ్రహం తెప్పించింది. ప్రత్యేక పూజలు అంటూ, అర్చనలు చేస్తూ.. టికెట్‌ కొన్న వారికి స్వామి దర్శనం కలుగకుండా అడ్డు పెట్టడమేంటని కొందరు భక్తులు మండి పడ్డారు. ముందుగానే చాలీ చాలని స్థలం ఉండటం అందులోనే వీఐపీలు, సేవకులు, పోలీసులు, పాలక మండలి సభ్యులు, అర్చకుల కుటుంబ సభ్యులు ఉండటంతో, రూ.వంద టికెట్‌ పెట్టి వెళ్లినా స్వామి దర్శనం కలుగక ముందే బయటికి లాగేయడం ఏమాత్రం సమంజసం కాదని పలువురు భక్తులు మండిపడ్డారు.

బందోబస్తు

భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకొని పులివెందుల డీఎస్పీ మురళి ఆధ్వర్యంలో సీఐలు శంకర్‌ రెడ్డి, గోవిందరెడ్డి, నరసింహులు, పలువురు ఎస్సైలు పెద్ద ఎత్తున పోలీసులు బందో బస్తు నిర్వహించారు. వాహనాలను అద్దాలమర్రి క్రాస్‌, ఇడుపుల పాయ క్రాస్‌ల వద్దనే నిలిపి వేశారు. దీంతో భక్తులు కాలినడకన గండికి చేరుకొని దర్శించుకున్నారు. వృద్ధులు, మహిళల కోసం వేంపల్లె ప్రైవేట్‌ పాఠశాలల వారు ఉచితంగా వ్యాన్‌లు ఏర్పాటు చేశారు. కొందరు భక్తులైతే వేంపల్లె, చక్రాయపేట, నాగలగుట్టపల్లె, వేముల తదితర ప్రాంతాల నుంచి కాలినడకన వచ్చి తమ మొక్కులు తీర్చుకున్నారు.

ప్రత్యేక అలంకరణలో స్వామి వారు

శ్రావణ మాస ఉత్సవం సందర్భంగా స్వామి ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన, ఉప ప్రధాన, అర్చకులు కేసరి, రాజారమేష్‌, అర్చకులు రఘుస్వామి.. స్వామిని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తుల కోసం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరింపజేశాయి. చక్రాయపేట ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో వైద్యశిబిరం ఏర్పాటు చేశారు.

ఆదాయం రూ.29 లక్షలు

శ్రావణ మాసం మూడవ శనివారం గండి వీరాంజనేయ స్వామి ఆలయానికి రూ.29,00,343 ఆదాయం వచ్చినట్లు ఆలయ సహాయ కమిషనర్‌ విశ్వనాథ్‌ తెలిపారు.

ఆర్జిత సేవా టికెట్లు, లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం, ప్రత్యేక దర్శనం, తాత్కాలిక హుండీలు, తాత్కాలిక షాపులు, తలనీలాలు, లడ్డూ కవర్ల విక్రయం తదితరాల ద్వారా 26,70,700లు, అన్నదానం విరాళాల ద్వారా రూ.2,29,643 కలిపి మొత్తం వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే వేంపల్లె గుణసాయి టీవీఎస్‌ షోరూం, గండి వాసవీ ఆర్యవైశ్య అన్నదాన సత్రం, తిరుపతి సుబ్రమణ్యంరెడ్డి, పెద్ద మల్లయ్య కుమారులు, కడపకు చెందిన సప్తగిరి గోవిందమాల, ఎర్రగుంట్లకు చెందిన కాశిరెడ్డినాయన సేవాసమితి, పర్లపాడుకు చెందిన కాశిరెడ్డి అంకాల్‌రెడ్డి, దేవగుడి సుబ్బ రామిరెడ్డి, గండి భజన బృందానికి చెందిన చెన్నకృష్ణారెడ్డి అన్నప్రసాదం, అల్పాహారం ఏర్పాటు చేసినట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement