రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థుల దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థుల దుర్మరణం

Aug 30 2026 12:45 AM | Updated on Aug 30 2026 12:45 AM

ఆ ఇద్దరూ ప్రాణ స్నేహితులు.. ఎప్పుడూ కలిసే ఉండే వారు. ఉన్నత చదువులు చదివి, ప్రయోజకులవుతారని కన్నవారు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఒకరు హోమియోపతి డాక్టర్‌ కావాలని, మరొకరు ఇంజనీర్‌ కావాలని కలలుగన్నారు. కానీ, విధి ఆడిన వింత నాటకంలో ఆ ఆశలన్నీ ఒక్క క్షణంలో చిదిమిపోయాయి. కడప శివారులోని సింగపూర్‌ టౌన్‌షిప్‌ సమీపంలో శనివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం.. ఆ ఇద్దరు విద్యార్థుల కుటుంబాల్లో తీరని చీకట్లను నింపింది. వేగంగా వచ్చిన కారు వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో, ఇద్దరు స్నేహితులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయి, కన్నవారికి గుండెకోతను మిగిల్చారు.

కడప అర్బన్‌ : కడప శివారులోని సింగపూర్‌ టౌన్‌షిప్‌ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందారు. ఉన్నత చదువుల కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తల్లిదండ్రులు, బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల వివరాల మేరకు.. ప్రకాశం జిల్లా ఆర్‌.ఉమ్మడివరానికి చెందిన ముడి మెలపూ పవన్‌కుమార్‌రెడ్డి(21), దువ్వూరు మండలం అశోక్‌నగర్‌కు చెందిన జస్వంత్‌కుమార్‌రెడ్డి(23) చిన్ననాటి స్నేహితులు. పవన్‌ కుమార్‌రెడ్డి కడప ప్రభుత్వ హోమియోపతి కళాశాలలో బీహెచ్‌ఎంఎస్‌ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. జస్వంత్‌ కుమార్‌రెడ్డి కడపలోని ఎస్‌.వి ఇంజినీరింగ్‌ కళాశాలలో ఇంజనీరింగ్‌ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. వీరిద్దరూ కడప నగరం చెమ్మూమియాపేటలో భగత్‌ సింగ్‌ పార్కు వద్ద ఇంటిని అద్దెకు తీసుకొని విద్యనభ్యసిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ శనివారం రాత్రి ఊటుకూరు కూడలి నుంచి రింగురోడ్డుపై నగరవనానికి వెళ్తున్నారు. నగరవనం వైపు నుంచి సింగపూర్‌ టౌన్‌షిప్‌నకు వస్తున్న కారు మలుపు తిప్పుకునే సమయంలో.. ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు దాదాపు పది మీటర్ల దూరంలో ఎగిరి కింద పడ్డారు. ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కారులో ఉన్నవారికి బెలూన్‌ ఓపెన్‌ కావడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. విషయం తెలుసుకున్న ట్రాఫిక్‌ సీఐ తులసీరామ్‌ తమ సిబ్బందితో ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను మార్చురీకి తరలించారు.

బైక్‌ను ఢీకొన్న కారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement