కరువు సీమకు శ్రీశైలం నీరివ్వండి | - | Sakshi
Sakshi News home page

కరువు సీమకు శ్రీశైలం నీరివ్వండి

Aug 30 2026 12:45 AM | Updated on Aug 30 2026 12:45 AM

కడప సెవెన్‌రోడ్స్‌ : తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్ట్‌ నీటితో రాయలసీమ జలాశయాలను నింపి ఆదుకోవాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. శనివారం కడపలోని ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎల్‌నినో వల్ల అధిక వర్షపాత లోటు ఏర్పడిందని పేర్కొన్నారు. తాగునీరు, పశువులకు మేత కరువైందన్నారు. జిల్లాలో మొత్తం 40 మండలాల్లోనూ అనావృష్టి నెలకొందన్నారు. అయినా వెన్నుపోటు ప్రభుత్వానికి చీమకుట్టినట్లు లేదని విమర్శించారు. కర్ణాటక, మహారాష్ట్రలలో కురిసిన భారీ వర్షాల వల్ల శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం వచ్చి చేరిందన్నారు. ఒక దశలో 879 అడుగులకు నీటిమట్టం చేరినప్పటికీ పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమ ప్రాజెక్టులకు నీరివ్వాలన్న ఆలోచన చంద్రబాబు ప్రభుత్వానికి లేదని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్‌ ఉత్పాదన చేపట్టి కల్వకుర్తి, దిండి, ఎత్తిపోతల పథకాలకు నీటిని తరలిస్తున్నా బాబులో చలనం లేదన్నారు. ప్రభుత్వ వైఖరి వల్ల శ్రీశైలంలో నీటిమట్టం అంతకంతకు పడిపోతుండడం రాయలసీమ ప్రజల్లో ఆందోళన కలిగిస్తోందన్నారు.

అక్రమ ప్రాజెక్టులు అడ్డుకోకపోతే శాశ్వత వలసలు

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో దాదాపు 80 శాతం పనులు జరిగిన రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ను కూటమి ప్రభుత్వం పక్కన పడేసిందన్నారు. అది పూర్తయి ఉంటే ఈ రోజు ఇంత ఆందోళన చెందాల్సిన పని ఉండేది కాదన్నారు. తమ పార్టీ నాయకులు ఛలో పోతిరెడ్డిపాడు కార్యక్రమాన్ని చేపట్టగా, ప్రభుత్వం అడ్డుకుందని విమర్శించారు. కర్ణాటక, తెలంగాణ అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్నా ప్రభుత్వం అడ్డుకోవడం లేదని, దీంతో భవిష్యత్తులో ఇక్కడి ప్రజలు శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతుందన్నారు. జిల్లాలో కేసీ కెనాల్‌ పరిధిలో బోర్ల కింద 30–40 వేల ఎకరాల్లో పంటలు సాగయ్యాయని, మిగతా ఆయకట్టులో వర్షాధారం కింద పంటలు వేశారన్నారు. నీరు రాకపోవడం వల్ల పూర్తిగా ఎండిపోయే పరిస్థితి నెలకొందన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూటమి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ సమావేశంలో మాజీ మేయర్‌ పాకా సురేష్‌, మాజీ డిప్యూటీ మేయర్‌ నిత్యానందరెడ్డి, ఎస్సీ సెల్‌ స్టేట్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పులి సునీల్‌కుమార్‌, జిల్లా అధ్యక్షులు ఎస్‌.వెంకటేశ్వర్లు, శ్రీరంజన్‌ తదితరులు పాల్గొన్నారు.

875 అడుగుల నీటిమట్టం నిర్వహించాలి

తెలంగాణ నీటిని తరలిస్తుంటే

అడ్డుచెప్పని బాబు

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు

పి.రవీంద్రనాథ్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement