చక్రాయపేట : అంజన్న దర్శనంతో భక్తజనం పరవశం చెందారు. గండిలో శ్రావణ మాస రెండో శనివారోత్సవం వేడుకగా జరిగింది. శ్రావణమాసంలో రెండవ శనివారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. అయితే గత వారం కంటే భక్తుల సంఖ్య తగ్గినట్లు అంచనా వేస్తున్నారు. ఉదయం నుంచి సర్వదర్శనం క్యూలైన్ మినహా మిగతా క్యూలైన్లన్నీ ఖాళీగానే కనిపించాయి. దీంతో ఎలాంటి ఇబ్బందులు పడకుండా భక్తులు ప్రశాంతంగా స్వామిని దర్శించుకుని వెళ్లారు. పలువురు పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహించి తమ మొక్కు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన, ఉప ప్రధాన, ముఖ్య అర్చకులు కేసరి, రాజారమేష్, రాజగోపాలా చార్యులు, అర్చకులు రఘు, సాయి ఉదయాన్నే స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. గండికి వచ్చిన భక్తులు తలనీలాలు సమర్పించుకొని స్నాన ఘట్టాల వద్ద స్నానం చేసి స్వామి దర్శనం చేసుకున్నారు.
కొబ్బరికాయలు అధిక ధరకు విక్రయం
కడప సర్వజన ఆస్పత్రి వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. చక్రాయపేట ప్రభుత్వ వైద్యశాల తరఫున వైద్య శిబిరం నిర్వహించి అస్వస్థతకు గురైన వారికి సత్వరం చికిత్సలు చేశారు. స్వామి సన్నిధిలో ట్రిపుల్ ఐటీ, వేంపల్లె పాలిటెక్నికల్ కళాశాల విద్యార్థులు సేవలు అందించి ఆలయ వర్గాలకు సహకరించారు. కొబ్బరి కాయలు, పూలదండలు దేవదాయ శాఖ నిర్ణయించిన దాని కంటే అధిక ధరకు అమ్ముతున్నా పట్టించుకోవడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు కాలినడకన గండికి వచ్చి స్వామిని దర్శించుకొని తమ మొక్కులు తీర్చుకున్నారు. ఆర్కేవ్యాలీ సీఐ శంకర్‌రెడ్డి, ఎస్సై శ్రీప్రియ, చక్రాయపేట ఎస్సై చంద్రశేఖర్ తమ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. భక్తుల కాలక్షేప నిమిత్తం రాత్రి ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరింపజేశాయి. ఆలయం తరఫున పెద్ద ఎత్తున అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. రాత్రి బస చేసిన వారికి ఆకలి తీర్చేందుకు గండి ఆంజనేయస్వామి భజన సంఘం ఆధ్వర్యంలో నందరాపు చెన్న కృష్ణారెడ్డి అల్పాహారం ఏర్పాటు చేశారు.
ఆదాయం రూ.19.85 లక్షలు
శ్రావణ మాసం రెండవ శనివారోత్సవం సందర్భంగా గండి ఆలయానికి రూ.19,85,127ల ఆదాయం వచ్చినట్లు ఆలయ సహాయ కమిషనర్ విశ్వనాథ్ తెలిపారు. ఆర్జిత సేవా టికెట్లు, అన్నదాన విరాళాలు, లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం, తాత్కాలిక హుండీలు, తాత్కాలిక దుకాణాలు, తలనీలాల టికెట్లు తదితరాల ద్వారా ఈ ఆదాయం వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.
వేడుకగా శ్రావణ రెండో శనివారోత్సవం


