‘నేను ఎవరినీ మోసం చేయలేదు’ | - | Sakshi
Sakshi News home page

‘నేను ఎవరినీ మోసం చేయలేదు’

Aug 23 2026 1:40 AM | Updated on Aug 23 2026 1:40 AM

పెళ్లి పేరిట ఇబ్బందులకు గురి చేసిన ప్రసాద్‌

యువతి ఎస్తేరు రాణి వెల్లడి

వేంపల్లె : కడప నగరం రవీంద్ర నగర్‌కు చెందిన ఎస్తేరు రాణి డబ్బులు తీసుకుని పెళ్లి చేసుకోకుండా మోసం చేసిందని.. వేంపల్లి మండలం కత్తులూరు గ్రామానికి చెందిన వెంకట ప్రసాద్‌రెడ్డి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె శనివారం విలేకరులతో మాట్లాడారు. వివరాలు ఆమె మాటల్లోనే.. ‘నేను ఎవరినీ మోసం చేయలేదు. పెళ్లి పేరిట ప్రసాద్‌రెడ్డి నన్ను చాలా ఇబ్బందులకు గురి చేశాడు. ప్రతి రోజు డబ్బులు ఆశ చూపి నన్ను పెళ్లి చేసుకోవాలని మానసికంగా టార్చర్‌ చేశాడు. నేను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేనని చాలా సార్లు చెప్పాను. నేను డిప్యూటేషన్‌పై పులివెందులలోని పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ కార్యాలయంలో పని చేస్తున్నాను. రోజూ కడప నుంచి బస్సులో పులివెందులకు వస్తాను. పశువుల దాణా కోసం ఆఫీస్‌ వద్దకు ప్రసాద్‌ వచ్చి పరిచయమయ్యాడు. ఏడాది నుంచి ఇద్దరం ఒకరికొకరం మాట్లాడుకునే వారం. అప్పుడప్పుడూ నాకు డబ్బులు ఇస్తూ షాపింగ్‌కు కూడా వెళ్లే వాళ్లం. ఎంత చెప్పినా వినకుండా పెళ్లి చేసుకోవాలని రోజూ నన్ను ఇబ్బంది పెడుతూనే వచ్చాడు. నన్ను కాదని వేరొకరిని పెళ్లి చేసుకుంటే చంపుతానని బెదిరించాడు. చేసుకుంటే నన్నే పెళ్లి చేసుకోవాలి, లేకుంటే మరెవరిని పెళ్లి చేసుకోకూడదని వేధించాడు. ఈ నేపథ్యంలో ఈనెల 18వ తేదీ రాత్రి పెళ్లి చేసుకోవాలని ఫోన్‌ చేయగా.. నేను నిరాకరించడంతో నాపై అసత్య ఆరోపణలు చేసి వేంపల్లె పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. వేంపల్లె సీఐ నరసింహులు నన్ను విచారణ చేయగా పూర్తి వివరాలు తెలియజేశాను. ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్నానని చెప్పడంతో.. నేను వద్దన్నా డబ్బులు ఇచ్చేవాడు. నేను సీఐ నరసింహులు సమక్షంలో ప్రసాద్‌రెడ్డికి రూ.5.60 లక్షల చెక్కును అందజేశాను. మోసం చేసే మనిషిని అయితే తిరిగి డబ్బులు ఇచ్చే దాన్ని కాదు కదా. ఒక మహిళ అని చూడకుండా నాపై అసత్య ఆరోపణలు చేయడం దుర్మార్గం’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement