● ఇద్దరికి తీవ్ర గాయాలు
● ఆగి ఉన్న ఐచర్ వాహనాన్ని ఢీకొన్న మరో ఐచర్ వాహనం
మదనపల్లె టౌన్ : అన్నమయ్య జిల్లా కురబలకోట రైల్వే ఫ్లైఓవర్ వద్ద శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ముదివేడు పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వైఎస్‌ఆర్ కడప జిల్లా వీరాపునాయునిపల్లె మండలం నేలతిమ్మాయపల్లెకి చెందిన ఎస్.హుస్సేన్ పీరా(48), సయ్యద్ బాషా, అబ్దుల్లాలు కూరగాయల లోడ్‌తో బెంగళూరు నుంచి రాయచోటికి 8 గంటలకు బయల్దేరారు. కురబలకోట రైల్వే ఫ్లైఓవర్ వద్ద రోడ్డు పక్కన నిలిపి ఉన్న ఐచర్ వాహనాన్ని.. వీరి ఐచర్ వాహనం వేగంగా వచ్చి సుమారు 1 గంట సమయంలో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐచర్ వాహనం ముందు భాగం నుజ్జునుజ్జు కాగా, డ్రైవర్ హుస్సేన్ పీరాతో సహా ముగ్గురు క్యాబిన్‌లో ఇరుక్కుపోయారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది, స్థానికులు వారిని బయటికి తీసేందుకు తీవ్రంగా శ్రమించారు. అయితే డ్రైవర్ హుస్సేన్ పీరా ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. గాయపడిన మరో ఇద్దరిని స్థానికుల సహాయంతో బయటికి తీసి, మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. హుస్సేన్ పీరా మృతి వార్త తెలియగానే కుటుంబ సభ్యులు జిల్లా ఆస్పత్రికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఘటనపై ముదివేడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నేలతిమ్మాయపల్లెలో విషాద ఛాయలు
వీరపునాయునిపల్లె : సయ్యద్ హుస్సేన్ పీరా మృతితో స్వగ్రామమైన నేలతిమ్మాయపల్లెలో విషాదఛాయలు అలుముకొన్నాయి. ఆయన సన్న నిమ్మ తోటలు కొనుగోలు చేసి వ్యాపారం చేస్తూ జీవనం గడిపే వాడు. వ్యాపార నిమిత్తం బెంగళూరుకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. హుస్సేన్ మృతదేహాన్ని శనివారం సాయంత్రం 5 గంటలకు స్వగామానికి తీసుకొచ్చారు. మృతుడికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లవాడు ఉండగా పెద్ద కుమార్తెకు వివాహమైంది. ఇంకా ఇద్దరు పిల్లలకు పెళ్లి కాలేదు. హుస్సేన్ చనిపోవడంతో కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది.


