● రూ.3,232 కోట్లతో కడప–రేణిగుంట 122 కి.మీ. హైవే పనులు ముమ్మరం
● డేంజర్ హైవేగా పాత రోడ్డు.. నిత్యం 17 వేల వాహనాలతో ఊపిరాడని ట్రాఫిక్
● వన్యప్రాణుల రక్షణకు 11 చోట్ల ప్రత్యేక ఓవర్‌పాస్ వంతెనల నిర్మాణం
● కేంద్ర ప్రాధాన్యత జాబితాలో చేర్చిన ఎంపీ మిథున్ రెడ్డి.. అటవీ అనుమతుల సాధన
రాజంపేట: శేషాచలం అటవీ ప్రాంతంలోని పచ్చటి ప్రకృతి ఒడిలో ఆహ్లాదకరమైన, సురక్షితమైన ప్రయాణాన్ని అందించే కడప–రేణిగుంట గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణం శరవేగంగా పరుగులు పెడుతోంది. షోలాపూర్–కర్నూలు–చైన్నె జాతీయ రహదారి (ఎన్‌హెచ్ 716) ప్రాజెక్టులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో ఈ హైవేను 329 కిలోమీటర్ల మేర విస్తరిస్తున్నారు. ఇందులో అత్యంత కీలకమైన కడప నుంచి రేణిగుంట వరకు 122 కిలోమీటర్ల దూరాన్ని నాలుగు వరుసలుగా (ఫోర్‌లేన్) విస్తరించేందుకు రూ.3,232 కోట్ల భారీ బడ్జెట్‌తో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. రవాణా వేగం పెంచేందుకు ఈ ప్రాజెక్టును చిన్నఓరంపాడు వద్ద రెండు ప్యాకేజీలుగా (64 కి.మీ, 58 కి.మీ) విభజించి పనులు చేస్తున్నారు.
నిత్యం 17 వేల వాహనాలు..
‘డేంజర్’గా మారిన పాత హైవే
ప్రస్తుతం అందుబాటులో ఉన్న కడప–రేణిగుంట పాత హైవే రహదారి రోజురోజుకూ ‘డేంజర్ జోన్’గా మారుతోంది. ఈ మార్గం మీదుగా తిరుపతి, చైన్నె, ముంబై, హైదరాబాద్ నగరాల మధ్య నిత్యం 17 వేలకు పైగా వాహనాలు పరుగులు తీస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్ ఒత్తిడిని తట్టుకునే కెపాసిటీ పాత రోడ్డుకు లేదు. ఫలితంగా ఇరుకై న మలుపుల వద్ద నిత్యం ఘోర ప్రమాదాలు జరుగుతూ ఎక్కడో ఒకచోట రహదారి రక్తమయమవుతోంది. తరచూ కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోవడంతో ప్రయాణికుల సమయం వృథా అవుతోంది. ఈ నరకయాతన నుంచి విముక్తి కోసం కడప, తిరుపతి జిల్లాల ప్రజలు గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం త్వరితగతిన పూర్తి కావాలని కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురుచూస్తున్నారు.
ఎంపీ మిథున్‌రెడ్డి విశ్వప్రయత్నాలు..
ఫలించిన కల
ఈ ప్రాజెక్టు త్వరితగతిన పట్టాలెక్కడం వెనుక రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి కృషి ఎంతో ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న రహదారుల ప్రాధాన్యత జాబితాలో ఈ కడప–రేణిగుంట ఎన్‌హెచ్‌ను చేర్చేలా ఆయన ఢిల్లీ స్థాయిలో విశ్వప్రయత్నాలు చేశారు. ఫలితంగానే కేంద్రం నుండి నిధుల మంజూరు, భూసేకరణతో పాటు టెండర్ల ప్రక్రియ వేగంగా పూర్తయింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పరిధిలోని అటవీ అనుమతులను తీసుకొచ్చేలా ఆయన చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించి, నేడు పనులు క్షేత్రస్థాయిలో పరుగులు పెడుతున్నాయి.
కింద జంతువులు – పైన వాహనాలు:
వన్యప్రాణుల రక్షణకు ప్రత్యేక డిజైన్!
ఈ ప్రాజెక్టుకు వన్యప్రాణి సంరక్షణ విభాగం అనుమతులు లభించడంతో అటవీ సరిహద్దు ప్రాంతాల్లో పనులు ఊపందుకున్నాయి. అడవిలో క్రూరమృగాలు, వన్యప్రాణుల సంచారానికి ఎలాంటి ప్రమాదం కలగకుండా ఉండేందుకు అధికారులు సరికొత్త సాంకేతిక డిజైన్‌ను రూపొందించారు. అటవీ మార్గంలో మొత్తం 5.5 కిలోమీటర్ల మేర 11 చోట్ల ప్రత్యేక వంతెనలను (ఎలివేటెడ్ ఓవర్‌పాస్) నిర్మించనున్నారు. ఈ డిజైన్ ప్రకారం వాహనాలు వంతెనలపై నుంచి రాకపోకలు సాగిస్తుండగా, వంతెనల కింద భాగం నుంచి వన్యప్రాణులు ఎటువంటి అడ్డంకులు లేకుండా అటు ఇటు సంచరించవచ్చు. అయితే, ఈ వంతెనల నిర్మాణ పనులను హైవే ప్రాజెక్టు తుది దశలో పూర్తి చేయనున్నారు.


