పదహారేళ్ల పసిపాప ! | - | Sakshi
Sakshi News home page

పదహారేళ్ల పసిపాప !

Aug 22 2026 1:29 AM | Updated on Aug 22 2026 1:29 AM

పుట్టుకతోనే పక్షవాతం

మంచానికే పరిమితమైన బాలిక

94 శాతం వైకల్యమున్నా

కనికరించని అధికారులు

చాపాడు: సాధారణంగా పదహారేళ్ల ప్రాయంలో ఉన్న పిల్లలు పాఠశాలలకు వెళ్తూ, తోటివారితో కలిసి ఎంతో ముచ్చటగా ఆడిపాడాలి. భవిష్యత్తుపై ఎన్నో రంగుల కలలు కనాలి. కానీ, ఆ అమ్మాయి మాత్రం కన్నవారికి పసిపాప లాగానే మిగిలిపోయింది. తోటి స్నేహితులు ఆడుతూ పాడుతూ బడికి వెళుతుంటే.. తాను మాత్రం నిత్యం మంచానికే పరిమితమై తల్లిదండ్రుల మీద ఆధారపడి జీవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పుట్టుకతోనే పక్షవాతం రావడంతో గత 16 ఏళ్లుగా ఆ పసిప్రాణం జీవితంతో పోరాడుతోంది.

విధి ఆడిన వింత నాటకం..

చాపాడు మండలం చిన్నగురువలూరు గ్రామానికి చెందిన మల్లు నాగరాజు, బాల నరసమ్మ దంపతుల కుమార్తె లింగమ్మ 2010 జనవరిలో జన్మించింది. విపరీతమైన శ్వాస సంబంధమైన వ్యాధితో జన్మించిన లింగమ్మ, పుట్టుకతోనే పూర్తిగా పక్షవాతం బారిన పడింది. పుట్టినప్పటి నుండి నేటివరకు ఆ బాలిక లోకం అంతా ఆ మంచమే అయింది. కాళ్లు, చేతులు పూర్తిగా పడిపోవడంతో, దైనందిన అవసరాలన్నింటికీ ఆ తల్లిదండ్రులు పసిబిడ్డలా సాకాల్సి వస్తోంది. చిన్ననాటి నుండి తమ కూతురు మంచానికే పరిమితం అయినప్పటికీ, కన్నప్రేమతో నాగరాజు, బాల నరసమ్మ దంపతులు ఆమెను కంటికి రెప్పలా చూసుకుంటూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోషిస్తూ వస్తున్నారు.

94 శాతం వైకల్యమున్నా..

సాధారణంగా ఇలాంటి తీవ్ర వైకల్యం ఉన్నవారికి ప్రభుత్వం పింఛన్‌ రూపంలో చేయూత అందిస్తుంది. లింగమ్మకు 2022లోనే ‘సదరం’ క్యాంప్‌ ద్వారా 94 శాతానికి పైగా వైకల్యం ఉన్నట్లు వైద్యాధికారులు ధ్రువీకరణ పత్రం (సర్టిఫికెట్‌) కూడా మంజూరు చేశారు. ఆ సమయంలో పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇప్పటివరకు పింఛన్‌ మంజూరు కాలేదని కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు. 16 ఏళ్లుగా రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నా లింగమ్మకు మాత్రం పింఛన్‌ భాగ్యం కలగడం లేదు.

నేడు కూటమి పాలనలోనూ..

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో అప్పటి మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి చిన్నగురువలూరు గ్రామంలో పర్యటించారు. ఆ సమయంలో లింగమ్మ పరిస్థితిని చూసి చలించిపోయిన ఆయన, తక్షణమే ఆ బాలికకు పింఛన్‌ మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. అయినా అధికారుల నిర్లక్ష్యం వల్ల అప్పట్లో పింఛన్‌ రాలేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గత రెండేళ్లలో పలుమార్లు కార్యాలయాల చుట్టూ తిరిగి దరఖాస్తులు సమర్పించినా ఫలితం శూన్యమైంది.ఇప్పటికై నా ఉన్నతాధికారులు, మానవతావాదులు స్పందించి తమ కుమార్తె ఆరోగ్య పరిస్థితిని, వైకల్య తీవ్రతను అర్థం చేసుకుని పింఛన్‌ మంజూరు చేయించాలని.. ఆర్థికంగా తమకు ఆసరాగా నిలిచి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆ నిరుపేద తల్లిదండ్రులు చేతులు జోడించి వేడుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement