మహారాష్ట్ర వాసి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

మహారాష్ట్ర వాసి ఆత్మహత్య

Aug 22 2026 1:29 AM | Updated on Aug 22 2026 1:29 AM

మహారాష్ట్ర వాసి ఆత్మహత్య విద్యుత్‌ కాంట్రాక్టర్‌ ఆత్మహత్యాయత్నం జీవాల చోరీ కేసులో నిందితుడి అరెస్ట్‌ అక్రమ మద్యం పట్టివేత

రాజంపేట : మండలంలోని హస్తవరం రైల్వేస్టేషన్‌లో మహారాష్ట్రలోని లాధూర్‌ గ్రామానికి చెందిన పారిశుధ్య కార్మికుడు మారుతీ(79) రైలు ట్రాక్‌ పక్కన చెట్టుకు ఊరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు శుక్రవారం వెలుగులోకి వచ్చింది. రేణిగుంట ఎస్‌ఐ మధుసూదన్‌ వివరాల మేరకు.. మారుతీ పారిశుధ్య కార్మికునిగా పని చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈనెల 18 చైన్నెకి వచ్చారు. చైన్నె మున్సిపాలిటీలో పని చేస్తున్నారు. మద్యం అతిగా సేవిస్తుంటే, భార్య మందలించింది. తాగొద్దన్నందుకు ఇంటి నుంచి వచ్చేశారు. హస్తవరం స్టేషన్‌లో ఆగే అరక్కోణం–కడప రైలులో బుధవారం వచ్చినట్లుగా తెలుస్తోంది. మనస్తాపానికి గురై హస్తవరం స్టేషన్‌ పరిధిలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికులు గుర్తించి, స్ధానిక రైల్వే స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. జీఆర్‌పీ కానిస్టేబుల్‌ గణేష్‌ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. రేణిగుంట జీఆర్‌పీలో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

–బిల్లుల చెల్లింపులో జాప్యంతో ఘటన

మైదుకూరు : బిల్లులు చెల్లింపులో జాప్యం జరుగుతోందనే ఆవేదనతో శుక్రవారం స్థానిక విద్యుత్‌ ఏఈ కార్యాలయం వద్ద చాపాడు మండలానికి చెందిన బుర్రి నాగరాజు అనే సబ్‌ కాంట్రాక్టర్‌ ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. బిల్లుల కోసమే కార్యాలయానికి వచ్చిన మరి కొందరు కాంట్రాక్టర్లు.. నాగరాజును అడ్డుకొని పెట్రోల్‌ సీసాను లాక్కొని పారవేశారు. చాపాడు మండలం నెరవాడకు చెందిన నాగరాజు విద్యుత్‌ స్తంభాలు వేయడం, ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయడం వంటి పనులను సబ్‌ కాంట్రాక్టు తీసుకుని చేపట్టాడు. రూ.30 లక్షలు రావాల్సి ఉండగా ఆలస్యం కావడంతో.. పనుల కోసం తెచ్చిన అప్పులకు వడ్డీ పెరుగుతోందనే ఆవేదనతో ఈ చర్యకు పాల్పడ్డాడు. నాగరాజుతోపాటు మైదుకూరు, దువ్వూరు మండలాలకు చెందిన మరో నలుగురు సబ్‌ కాంట్రాక్టర్లకు రూ.కోటి 50 లక్షల మేరకు బిల్లులు రావాల్సి ఉందని తెలుస్తోంది. దీనిపై ఏఈ రామభద్రయ్య మాట్లాడుతూ కొన్ని సాంకేతిక కారణాల వల్ల బిల్లుల చెల్లింపులో ఆలస్యమైందని, పది రోజుల్లో బిల్లులు చెల్లిస్తామని తెలిపారు.

అంచనా ప్రకారం పనులు చేపట్టకనే..

ఈ సంఘటనపై ఏడీఈ శ్రీకాంత్‌ పత్రికా ప్రకటన విడుదల చేశారు. బిల్లుల చెల్లింపులో జరుగుతున్న జాప్యంపై ఆ కాంట్రాక్టర్‌ వ్యక్తిగతంగా తన పేరు చెప్పడం బాధాకరమని ఏడీఈ పేర్కొన్నారు. మైదుకూరు సబ్‌ డివిజన్‌లో ముఖ్యంగా మైదుకూరు, చాపాడు, వనిపెంట సెక్షన్లలో ఎక్కువ శాతం పరికరాలు వాడకపోయినా, అంచనా ప్రకారం పనులు చేపట్టకపోయినా, ఫీల్డ్‌లో పనులు జరగకపోయినా.. అధికారి బిల్లులు చేసి తనకు పంపించడం వల్లే తాను వెనక్కు పంపినట్టు వివరించారు. తనవైపు ఎటువంటి తప్పిదం లేకున్నా తన పేరు వాడటం అనాలోచిత చర్య అని పేర్కొన్నారు.

– రూ.1.50 లక్షలు స్వాధీనం

రాజుపాళెం : జీవాల చోరీల కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడిని ఎట్టకేలకు అరెస్ట్‌ చేశారు. ఈ చోరీకి సంబంధించి రాజుపాళెం పోలీస్‌ స్టేషన్‌లో ప్రొద్దుటూరు అడిషనల్‌ ఎస్పీ విభూ కృష్ణ శుక్రవారం వివరాలను వెల్లడించారు. గతంలో ప్రొద్దుటూరు, రాజుపాళెం మండలాల్లో గొర్రెలు, పొట్టేళ్ల చోరీ కేసులో ఇప్పటికే ఏడుగురిని అరెస్ట్‌ చేశామని తెలిపారు. ఈ ముఠాకు నాయకత్వం వహిస్తున్న ప్రధాన నిందితుడు పరారీలో ఉన్న నంద్యాల జిల్లా బనగానపల్లెకు చెందిన దేవరకొండ రమేష్‌ అలియాస్‌ వంకాయ ముక్కు రమేష్‌ను అరెస్ట్‌ చేశామన్నారు. అతని వద్ద నుంచి రూ.1.50 లక్షలను రికవరీ చేశామన్నారు. ఈ నేరాల ద్వారా సంపాదించిన సొమ్మును ప్రధాన నిందితుడు విలాసవంతమైన జీవనానికి ఉపయోగిస్తున్నట్లు విచారణలో వెల్లడైందన్నారు. ఇతనిపై రెండు హత్యాయత్నం కేసులు, ఐదు గొర్రెల దొంగతనాల కేసులు నంద్యాల జిల్లా బనగానపల్లె, ప్రకాశం జిల్లా బెస్తవారి పేట, కర్నూలు జిల్లా గడివేముల, ఆదోని, కడప జిల్లాలోని బ్రహ్మంగారిమఠం ఇలా పలు పోలీస్‌ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయన్నారు. ఈ కేసుకు సంబంధించి మొత్తం రూ.6.70 లక్షలు రికవరీ అయినట్లు తెలిపారు. చోరీ కేసును ఛేదించేందుకు ప్రొద్దుటూరు రూరల్‌ సీఐ నాగభూషణం, రాజుపాళెం ఎస్‌ఐ ప్రణయ్‌కుమార్‌రెడ్డితోపాటు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ కేసుకు సంబంధించి సాంకేతిక ఆధారాలతో నిందితులను పట్టుకొని, చోరీకి ఉపయోగించిన వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. రాజుపాళెం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన జీవాల చోరీలో ఎక్కువ వృద్ధిరేటును సాధించినట్లు ఎస్‌ఐ ప్రణయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. జీవాల చోరీ విలువ రూ.5.05 లక్షలు కాగా అందులో రూ.4.95 లక్షలు రికవరీ చేశామన్నారు.

ఒంటిమిట్ట : ఒంటిమిట్టలో శుక్రవారం అక్రమంగా విక్రయిస్తున్న 12 మద్యం బాటిళ్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒంటిమిట్ట ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపిన వివరాల మేరకు.. ఒంటిమిట్ట గ్రామంలోని ఎస్సీ కాలనీ వద్ద ఉదయం పాల కొండయ్య అనే వ్యక్తి అక్రమ మద్యం విక్రయిస్తుండగా పట్టుబడ్డాడని, అతని వద్ద నుంచి 12 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement