కడప సెవెన్ రోడ్స్: ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్–2026)లో భాగంగా ప్రత్యేక ఓటరు జాబితాను పారదర్శకంగా, స్వచ్ఛంగా రూపొందించాలని జిల్లా ఎలక్షన్ రోల్ అబ్జర్వర్ చేతన్ టి.ఎస్. ఈఆర్వోలు, ఏఈఆర్వోలను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని బోర్డు మీటింగ్ హాల్ లో ఎస్‌ఐఆర్–2026 లో భాగంగా జేసీ నిధీమీనా, డీఆర్వో మల్లికార్జునుడులతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఈఆర్వోలు, ఏఈఆర్వోలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటరు జాబితా రూపకల్పనలో ఎన్నికల కమీషన్ ప్రక్రియ, నిబంధనలు అమలు చేయాలన్నారు. దేశంలో పెద్ద ఎత్తున జరిగే ఎన్నికల నిర్వహణలో చిన్న తప్పు జరగకుండా ఉండాలంటే ఎన్నికల కమీషన్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉందన్నారు. బీఎల్వోలు క్షేత్రస్థాయిలో 100 శాతం ఇంటింటి సర్వే చేపట్టాలన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులు వారి ఫిర్యాదులను ముందుగానే అందించాలని, క్షేత్రస్థాయిలో నాయకులకు తెలియజేసి అందరూ సహకరించేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా జేసీ డాక్టర్ నిధీమీనా జిల్లాలో ఎస్.ఐ. ఆర్. నిర్వహణ గురించి వివరిస్తూ... జిల్లాలో మొత్తం 18,96,231 మంది ఓటర్లు ఉండగా, జూలై 24 నాటికి 64,434 మంది (3.40 శాతం) మ్యాపింగ్ కాని ఓటర్లు, 2,43,180 మంది (12.82 శాతం) మ్యాపింగ్‌లో వ్యత్యాసాలు ఉన్న ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. కడప నియోజకవర్గంలో అత్యధికంగా 25,538 మంది మ్యాపింగ్ కాని ఓటర్లు ఉన్నారని వివరించారు. ఆగస్టు 20 నాటికి 3,07,685 నోటీసులను 100 శాతం జనరేట్ చేశామని, ఎక్కడా పెండింగ్ లేదని తెలిపారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణలో భాగంగా 2,251 కేంద్రాలను 2,444కు పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని, కొత్తగా 193 కేంద్రాల ఏర్పాటు, 20 కేంద్రాల మార్పు, 20 కేంద్రాల పేర్ల మార్పునకు ప్రతిపాదనలు పూర్తయ్యాయని జేసీ వివరించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఈఆర్వోలు, ఏఈఆర్వోలు తదితరులు పాల్గొన్నారు.
ఓటరు నమోదుకు ప్రత్యేక శిబిరాలు
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో భాగంగా అర్హులైన వారు తమ పేర్లను ఓటర్ల జాబి తాల్లో నమోదు చేసుకోవడానికి, అభ్యంతరాలు, సవరణలు, ఓటు బదిలీ కోసం ఎన్నికల కమిషన్ సెష్పల్ క్యాంపెయిన్ నిర్వహించనుంది. ఈ నెల 22, 23, 28, 29 తేదీల్లో జిల్లాలోని 2,444 పోలింగ్ కేంద్రాల్లో సంబంధిత బీఎల్వోలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఈ నెల 30నాటికి 18 ఏళ్లు పూర్తయ్యే యువతీ యువకులు ఓటర్ల జాబితాలో తమ పేర్ల ను నమోదు చేసుకోవడానికి అర్హులు. అలాగే ఏదైనా కారణాల వల్ల ఇప్పటి వరకు తమ పేర్లు నమోదు చేసుకోని అర్హులు కూడ నమోదు చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన ఫారం–6లు బీఎల్వోల వద్ద అందుబాటులో ఉంటాయి. అలాగే ఓటరు పేరు, ఇతర వివరాల్లో ఏవైనా తప్పులు ఉంటే వాటిని సవరించుకోవడానికి ఫారం–8 సమర్పించాల్సి ఉంటుంది. ఇక ఎవరైనా మరణించి ఉన్న లేక శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లి ఉన్నా అలాంటి వారి పేర్లను ఓటరు జాబితాల్లో నుంచి తొలగించాలంటూ ఫారం–7 సమర్పించాల్సి ఉంటుంది. ఇవన్నీ ఈ నెల 30 తేదీ లోపు సమర్పించాలి, నిరంతర నమోదు ప్రక్రియ అందుబాటులో ఉన్నప్పటికి ఈ నెల 30 తేదీలోపు దర ఖాస్తు చేసుకుంటేనే అక్టోబర్ 3న విడుదల అయ్యే ఓటర్ల తుది జాబితాల్లో అవకాశం ఉంటుంది.
ఓటర్లకు నోటీసుల జారీ....
ఎన్యూమరేషన్ ప్రక్రియలో వివిధ కారణాల వల్ల సరైన ఆధారాలు సమర్పించలేక పోయిన వారికి సంబంధిత ఈఆర్‌వోలు/ఏఈఆర్‌వోలు నోటీసులు జారీ చేస్తున్నారు. ఇప్పటికి జిల్లాలో 3,07,685 నోటీసులను జనరేట్ చేశారు. ఇందులో గురువారం నాటికి 2,55,637 మందికి నోటీసులు అందజేశారు. ఇంకా 52,048 మందికి నోటీసులు అందజేయాల్సి ఉంది. ఇప్పటికి నోటీసులు అందుకున్న వారిలో 34,210 మందిని విచారించారు. సెప్టెంబర్ 28 తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అనంతరం అక్టోబర్ 3న ఓటర్ల తుది జాబితా విడుదల అవుతుంది.
రాష్ట్ర ఎన్నికల అధికారి సమీక్ష
జిల్లాలో జరుగుతున్న సర్ ప్రక్రియపై రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ గురువారం కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. క్లయిమ్స్, అభ్యంతరాల పరిఫ్కారంలో భాగంగా క్షేత్ర స్థాయి ధృవీకరణ నిర్వహించాలన్నారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసి నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు.


