● కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో బాధితురాలి ఫిర్యాదు
● క్షేత్రస్థాయిలో పులివెందుల
డీఐఓ హేమలత తనిఖీ
వేంపల్లె: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పచ్చ నేతలు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. ‘మమ్మల్ని అడిగే నాథుడే లేడు’ అనే అధికార దర్పంతో దళితుల భూములను సైతం వదలకుండా కబ్జా చేసేందుకు అడ్డగోలుగా తెగబడుతున్నారు. వేంపల్లె మండలంలోని పాములూరు గుట్ట సమీపంలో ఉన్న సర్వే నంబరు–1లో, గత 30 ఏళ్లుగా దారా పద్మావతి అనే దళిత మహిళకు చెందిన 2.85 ఎకరాల పొలం ఉంది. అయితే, కూటమి అధికారంలోకి రాగానే స్థానిక టీడీపీ మండల ఉపాధ్యక్షుడు వీరభద్ర కన్ను ఆ విలువైన పొలంపై పడింది. రాత్రికి రాత్రే జేసీబీలు, ట్రాక్టర్లను పెట్టి అక్రమంగా గ్రావెల్ మట్టిని తోలి చదును చేస్తుండగా బాధితురాలు నిలదీయగా.. ‘ఇది మా పొలం.. మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి!’ అంటూ పచ్చ నేతలు ఆమెను తీవ్రంగా బెదిరించారు. దీంతో బాధితురాలు నేరుగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని గ్రీవెన్స్ సెల్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. దళిత మహిళ ఫిర్యాదుతో పులివెందుల డీఐఓ హేమలత వివాదాస్పద పాములూరు గుట్ట పొలాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. కూటమి నేతలు సదరు పొలంలో బహిరంగంగా గ్రావెల్ మట్టి తోలి చదును చేస్తుంటే మండల రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారంటూ వారిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీనికి తహసీల్దార్ శివశంకర్ రెడ్డి స్పందిస్తూ.. సర్వే నంబరు–1లో ఇంకా సబ్ డివిజన్ చేయలేదని, ఈ సర్వే నంబర్లలో చాలా అవకతవకలు ఉన్నాయని, పూర్తి సర్వే నిర్వహించి బాధితులకు భూమిని అప్పగిస్తామని దాటవేసే ప్రయత్నం చేశారు. చదును చేస్తున్న భూమి ప్రభుత్వ భూమి అని తేలితే సదరు వ్యక్తిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.


