●ఆరుతడి పంటలకై నా కేసీ నీరు అందేనా? | - | Sakshi
Sakshi News home page

●ఆరుతడి పంటలకై నా కేసీ నీరు అందేనా?

Aug 13 2026 12:57 AM | Updated on Aug 13 2026 12:57 AM

●ఆరుతడి పంటలకై నా కేసీ నీరు అందేనా?

పంటలవారీగా పెరిగిన ఆరుతడి సాగు వివరాలు

వరుణుడి కరుణతో జిల్లాలో

ఊపందుకున్న ఆరుతడి సాగు

శ్రీశైలం నిండుకుండలా మారినా కేసీ కాలువకు వరి నీరివ్వబోమంటూ కొర్రీలు

తీవ్ర ఆందోళనలో అన్నదాతలు!

కడప అగ్రికల్చర్‌: జిల్లావ్యాప్తంగా వారం రోజుల నుంచి కురుస్తున్న అనుకూల వర్షాలతో అన్నదాతల్లో ఆశ లు చిగురిస్తున్నాయి. మొన్నటివరకు ఎల్‌నినో ప్రభావంతో మందకొడిగా సాగిన ఖరీఫ్‌ సాగు పనులు, వరుణుడి కరుణతో ఇప్పుడు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ముఖ్యంగా వేరుశనగ, పత్తి, మినుము, మొక్కజొన్న వంటి ఆరుతడి పంటల సాగుపై రైతులు గట్టి ఆసక్తి చూపుతూ పొలం పనులను ముమ్మరం చేశారు. ఇటీవల కురిసిన వర్షాలు ఆరుతడి పంటలకు అమృతంలా మారడంతో సాగు విస్తీర్ణం గతేడాది కంటే ఈసారి గణనీయంగా పెరిగింది.

మరింత పెరగనున్న విస్తీర్ణం

ప్రస్తుతం కురుస్తున్న వర్షాల తేమతో ఈ పంటల సాగు విస్తీర్ణం రానున్న రోజుల్లో మరింత పెరగనుందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు.

7,758 హెక్టార్లలో వరిసాగు..

కేసీ కెనాల్‌ పరిధిలో తగ్గే ముప్పు!

జిల్లాలోని నీటి ఆధారిత బోర్లు, పెన్నా, కుందు, పాపాగ్ని నదీ పరివాహక ప్రాంతాల్లో ఈ ఏడాది వరిపంటను సాగు చేశారు. జిల్లాలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 33,078 హెక్టార్లు కాగా.. ఇప్పటివరకు 7,758 హెక్టార్లలో (23.4 శాతం) వరిపంట సాగైంది. నిజానికి కేసీ కెనాల్‌కు కనుక సకాలంలో నీరు విడుదలై ఉంటే.. ఒక్క కేసీ కెనాల్‌ కిందే రికార్డు స్థాయిలో దాదాపు 40 వేల హెక్టార్ల విస్తీర్ణంలో వరిపంట సాగయ్యే అవకాశం ఉండేది. కానీ ప్రస్తుతం ఖరీఫ్‌ వరిపంటకు నీటిని విడుదల చేయలేమని అధికారులు నిష్కర్షగా ప్రకటించడంతో రైతులు కేసీ కెనాల్‌ కింద వరి సాగు చేయడానికి తీవ్రంగా జంకుతున్నారు. ఈ అనాలోచిత నిర్ణయం వల్ల ఈ ఏడాది జిల్లాలో వరిపంట సాగు విస్తీర్ణం భారీగా తగ్గే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది.

శ్రీశైలం నిండినా.. కేసీ రైతుకు నిరాశే

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరదనీరు పోటెత్తడంతో శ్రీశైలం ప్రాజెక్టు దాదాపు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ఆగస్టు 11వ తేదీ ఉదయానికి నీటిమట్టం 878.80 అడుగులకు చేరింది. ప్రాజెక్టులోకి ఇంకా 72,849 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. మరో 6.2 అడుగుల మేర నీరు చేరితే శ్రీశైలం డ్యాం పూర్తిగా నిండిపోనుంది. ప్రాజెక్టులో ఇంత భారీగా నీరు ఉన్నప్పటికీ, నీటిపారుదల శాఖ అధికారులు మాత్రం ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి కేసీ కెనాల్‌ కింద వరిసాగుకు నీటిని అందించలేమని స్పష్టం చేయడంతో రైతాంగంలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి వరదనీరు వస్తుండటంతో కచ్చితంగా నీరు వదులుతారనే నమ్మకంతో బోర్ల కింద వరినారుమడులను సాగుచేసుకున్న రైతులు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.

గతేడాది కంటే 4,785 హెక్టార్లు అధికం

అధికారిక గణాంకాల ప్రకారం.. గతేడాది ఆగష్టు 11వ తేదీ నాటికి జిల్లాలో కేవలం 16,518 హెక్టార్లలో మాత్రమే వివిధ పంటలు సాగు కాగా.. ఈ ఏడాది ఆగష్టు 11వ తేదీ నాటికి ఏకంగా 21,303 హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. అంటే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అదనంగా 4,785 హెక్టార్లలో సాగు విస్తీర్ణం పెరిగింది. జిల్లావ్యాప్తంగా ఖరీఫ్‌ సాధారణ సాగు విస్తీర్ణం 76,496 హెక్టార్లు కాగా, ఇప్పటివరకు 21,303 హెక్టార్లలో (27.8 శాతం) సాగు పూర్తయింది. ఈ సాగు మరో వారం రోజుల్లో మరింత విస్తరించనుంది.

ప్రస్తుతం కురిసిన వర్షాల కారణంగా జిల్లాలోని ప్రధాన ఆరుతడి పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పుంజుకుంది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

మొక్కజొన్న : సాధారణ సాగు విస్తీర్ణం 1,495

హెక్టార్లు కాగా.. ఇప్పటివరకు

1,127 హెక్టార్లలో సాగై

75 శాతానికి చేరుకుంది.

వేరుశనగ : సాధారణ సాగు 4,446 హెక్టార్లు

కాగా.. ప్రస్తుతం 2,380 హెక్టార్లకు

చేరి 53.5 శాతానికి నమోదైంది.

మినుము : సాధారణ సాగు విస్తీర్ణం 3,745

హెక్టార్లు కాగా.. ఇప్పటివరకు 1,273

హెక్టార్లలో సాగై 34 శాతానికి చేరింది.

పత్తి : సాధారణ సాగు విస్తీర్ణం 22,469

హెక్టార్లు కాగా.. ప్రస్తుతం 7,405

హెక్టార్లకు పెరిగి 33 శాతానికి చేరుకుంది.

వరిసాగుకు నీటిని ఇవ్వలేమని ప్రకటించడంతో.. కనీసం ఆరుతడి పంటలకై నా నీటిని విడుదల చేసి కాపాడాలని పలువురు రైతులు కోరుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు వరదనీటితో నిండినప్పటికీ కనీసం ఆరుతడి పంటలకై నా నీరు విడుదల చేయకపోతే ఎలా అని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. వారం రోజుల నుంచి కురుస్తున్న కొద్దిపాటి వానలతో పంటలకు ఊపిరొచ్చినప్పటికీ, మళ్లీ వరుణుడు ముఖం చాటేస్తే పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని, కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement