కడప రూరల్ : కోవిడ్ మహమ్మారి ధాటికి వైఎస్సార్ కడప జిల్లాలో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఈ ప్రాణాంతక వైరస్‌కు అడ్డుకట్ట వేయడానికి యుద్ధ ప్రాతిపదికన కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం, పూర్తిగా చేతులెత్తేసింది. ప్రభుత్వ చేతగానితనం వల్ల కరోనా కట్టడి కాకపోగా, సర్కార్ ’కరోనాకు సరెండర్’ అయిందనే పదునైన విమర్శలు క్షేత్రస్థాయి నుండి వ్యక్తమవుతున్నాయి.
మహానాడు కోసం ప్రాణాలతో చెలగాటం
తాజాగా టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2025 మే నెలలో జిల్లాలో మళ్లీ కరోనా కేసులు వెలుగు చూశాయి. అయితే, అదే నెల 27 నుండి 29వ తేదీ వరకు తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా కడప నగరం సమీపంలోని, చింతకొమ్మదిన్నె మండలం, పబ్బాపురం గ్రామ పరిధిలో ’మహానాడు’ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ రాజకీయ వేడుకపై కరోనా కేసుల ప్రభావం ఎక్కడ పడుతుందోననే దురుద్దేశంతో, ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు అప్పట్లో కేసులను పూర్తిగా తొక్కిపెట్టారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. కరోనా ముప్పు పొంచి ఉన్నందున మహానాడును వాయిదా వేయాలని కొన్ని పార్టీలు, ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేసినా పాలకులు ఏమాత్రం పట్టించుకోకుండా యథేచ్ఛగా సభలు నిర్వహించారు. అప్పట్లో అదృష్టం కొద్దీ కేసులు బయటపడలేదని, నిజంగానే తొక్కిపెట్టారని ప్రజలు భావిస్తున్న తరుణంలోనే, ఇప్పుడు అసలు రంగు బయటపడింది.
జూలైలో మళ్లీ కోరలు చాచిన వైరస్..
అధికారుల అయిష్ట అంగీకారం
తాజాగా జూలై మొదటి వారం నుంచి జిల్లాలో మళ్లీ కరోనా కేసులు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా మొత్తం 8 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ అధికారులు ఎట్టకేలకు, అత్యంత అయిష్టంగా అంగీకరించాల్సి వచ్చింది. ప్రస్తుతం కేసులు నమోదైన ప్రాంతాల్లో రాపిడ్ రెస్పాన్స్ టీమ్ పర్యటిస్తూ పరిశీలిస్తోంది. అయితే, కరోనా పాజిటివ్ వచ్చిన బాధితులకు ఎలాంటి ఇతర ప్రాంతాల (ట్రావెల్ హిస్టరీ) నేపథ్యం లేదని నిర్ధారణకు రావడం గమనార్హం. బయటి నుంచి ఎవరూ రాకపోయినా, స్థానికంగానే కేసులు ఎందుకు వెలుగు చూస్తున్నాయి? అనే పెద్ద ప్రశ్నలు ఇప్పుడు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఇబ్బందులే
గతంలో క్షయ, ఎయిడ్స్ లాంటి ప్రాణాంతక వ్యాధులపై పాలక ప్రభుత్వాలు ఏళ్ల తరబడి యుద్ధం చేశాయి. నియంత్రణ కోసం పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో పాటు చికిత్స కోసం ప్రత్యేకంగా కోట్లాది రూపాయల నిధులను కేటాయించడం జరిగింది. ఇంత చేసినప్పటికీ ఇప్పటికీ ఎక్కడో ఒకచోట ఆ కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. అలాంటిది, అత్యంత వేగంగా సంక్రమించే కరోనా మహమ్మారిపై టీడీపీ కూటమి ప్రభుత్వం ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదో అంతుచిక్కని విధంగా మారింది. ఈ వైరస్ ధాటికి వైద్యం కోసం కోట్లు ఖర్చు పెట్టగలిగే కోటీశ్వరులు సైతం నేలలో కలిసిపోయారు. అలాంటప్పుడు కనీస స్తోమత లేని సామాన్య మానవుడు ఒక లెక్కలోనిది కాదు. ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతున్నామని పైకి ఆర్భాటంగా చెప్పుకుంటున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం ఎలాంటి ఆంక్షలు కానీ, నివారణ చర్యలు కానీ కనిపించడం లేదు. కరోనా సమాజంలో మన మధ్యనే ఎక్కడైనా ఉండొచ్చు. ఆ వ్యాధిని సకాలంలో నిర్ధారించి, సమయానికి వైద్య చికిత్స అందించకపోతే, ఈ మహమ్మారి పొరుగు వారిపై కూడా దాడి చేసి చైన్ లాగా విస్తరించే ప్రమాదం పొంచి ఉంది. కాగా, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అసలు కరోనా నిర్ధార ణ పరీక్షలకు సంబంధించిన కనీస పరికరాలే పెద్దగా లేకపోవడం అత్యంత ఆశ్చర్యకరం, విచారకరం.
కూటమి సర్కార్ చేతులెత్తేసి ‘సరెండర్’
మహానాడు కోసం 2025 మేలో కరోనా కేసులను తొక్కిపెట్టారు
జూలై మొదటి వారంలో 8 కేసులు వెలుగుచూసినట్లు ఎట్టకేలకు అంగీకరించిన ఆరోగ్యశాఖ
ట్రావెల్ హిస్టరీ లేకపోయినా వైరస్ వ్యాప్తి
కనీస నిర్ధారణ పరికరాలు కూడా లేకపోవడంపై విస్మయం
నాటి వైఎస్సార్‌సీపీ ఆదర్శ పాలన
గుర్తు లేదా?
జిల్లాలో మొదటిసారిగా 2020 మార్చి 30న కరోనా కేసులు వెలుగు చూసినప్పుడు, నాటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా వ్యవహరించింది. ఉదాహరణకు ఆలం ఖాన్ పల్లెలో ఒకే ఒక్క కేసు నమోదు కాగానే, సెవెన్ రోడ్స్ వద్ద భారీ బారికేడ్లను ఏర్పాటు చేసి రాకపోకలను పూర్తిగా నిషేధించారు. ఈ మహమ్మారి వరుసగా మూడేళ్ల పాటు అతలాకుతలం చేసినా, ప్రత్యేకంగా ఐసోలేషన్ కేంద్రాలు, వైద్య సిబ్బంది నియామకం, ఉచిత పరీక్షలు మరియు తక్షణ వైద్యం ద్వారా ఆదర్శవంతంగా కట్టడి చేశారు. రాష్ట్రంలో నాటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకున్న నివారణ చర్యలు భారతదేశానికే రోల్ మోడల్‌గా నిలిచాయి.కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇప్పటికై నా కళ్లు తెరిచి, ’కరోనాకు సరెండర్’ కాకుండా, ఆర్భాటపు ప్రచారాలు పక్కన పెట్టి మనిషి ప్రాణాలు కాపాడటానికి తక్షణమే యుద్ధప్రాతిపదికన వైద్య చర్యలు, పరీక్షల పరికరాల పంపిణీ చేపట్టాలని జిల్లా వ్యాప్తంగా సర్వత్రా అభిప్రాయం వ్యక్తమవుతోంది.


