చక్రాయపేట : బాలికపై అత్యాచారానికి సంబంధించి ఫోక్సో కేసులో నిందితుడు చెప్పలి సుబ్రమణ్యంను అరెస్టు చేసి లక్కిరెడ్డిపల్లె మెజి స్ట్రేట్ ముందు హాజరు పరచినట్లు పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ తెలిపారు.మండలంలోని ఎర్రబొమ్మనపల్లె గ్రామం గడ్డం వారిపల్లె హరిజనవాడకు చెందిన బాలికపై సుబ్రణ్యం గత గురువారం అఘాయిత్యానికి పాల్పడినట్లు చిన్నారి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు విచారణ జరిపి పొక్సో కేసు నమోదు చేశామని చెప్పారు. నిందితుడిని ఆదివారం లక్కిరెడ్డిపల్లె మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపచినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో చక్రాయపేట ఎస్సై చంద్ర శేఖర్.సిబ్బంది పాల్గొన్నారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతి
పులివెందుల రూరల్ : పులివెందుల మండల పరిధిలోని తుమ్మలపల్లె గ్రామ సమీపంలో అనారోగ్యంతో పడి ఉన్న గుర్తుతెలియని వ్యక్తిని స్థానికులు అంబులెన్స్‌లో కడప రిమ్స్‌కు తరలించారు. అక్కడ చిక్సిత పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి ఆదివారం మృతి చెందినట్లు పులివెందుల అర్బన్ ఎస్‌ఐ మధుసుదన్‌రెడ్డి తెలిపారు. ఆచూకీ తెలిస్తే పులివెందుల అర్బన్ పోలీసుస్టేషన్‌లో 9121100547 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.
రోడ్డు ప్రమాదంలో
యువకుడికి గాయాలు
వేంపల్లె : వేంపల్లె మండలంలోని కుమ్మరాంపల్లె గ్రామ సమీపంలో ఉన్న శ్రీ కృష్ణుని ఆలయం ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జాఫర్ అనే యువకుడుకి తీవ్ర గాయాలయ్యాయి. వేంపల్లెలోని బిడ్డాల మిట్టకు చెందిన కూరగాయల వ్యాపారం చేసే రాబియా కుమారుడు జాఫర్ ఆదివారం గండి వైపు నుంచి బైకులో వస్తుండగా కుమ్మరాంపల్లె లోని శ్రీ కృష్ణుడి ఆలయం వద్దకు రాగానే బైకు అదుపు తప్పి డివైడర్ ఢీకొని బోల్తా పడింది. దీంతో జాఫర్ కింద పడడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతన్ని వేంపల్లెలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్రీకృష్ణుడి ఆలయం సమీపంలో మలుపు ఉండడంతో బైకు స్కిడ్ అయినట్లు బాధితుడు జాఫర్ తెలిపారు.


