పులివెందుల టౌన్ : ఏపీ షూటింగ్ బాల్ సంఘం ఆధ్వర్యంలో వైఎస్సార్ స్పోట్స్ కాంప్లెక్స్‌లో రెండు రోజులుగా జరుగుతున్న అంతర్ జిల్లాల షూటింగ్ బాల్ ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పులివెందుల రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శాంతి లాల్ హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. షూటింగ్ బాల్ ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి వ్యాప్తి చెందుతూ అభివృద్ధి చెందుతోందన్నారు. 17 జిల్లాల నుంచి బాలికల జట్లు పాల్గొనగా పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. విశిష్ట అతిథిగా హాజరైన కోల ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రతిభగల క్రీడాకారులను నిరంతరం ప్రోత్సహించడానికి ఎల్లప్పుడూ ముందుంటానన్నారు. పోటీలు నిర్వహించడానికి తన వంతు సహకారం అందిస్తామని తెలిపారు. బాలుర భాగంలో విజేతగా పల్నాడు జట్టు, ద్వితీయ స్థానంలో ఎన్టీఆర్ జిల్లా, తృతీయ స్థానంలో ఏలూరు జట్లు నిలిచాయి. బాలికల విభాగంలో అనంతపురం జట్టు విజేతగా, నెల్లూరు జట్టు ద్వితీయస్థానంలో, చిత్తూరు జట్టు తృతీయ స్థానంలో నిలిచాయి. కార్యక్రమంలో ఏపీ షూటింగ్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పరశురాముడు, శాప్ పరిశీలకుడు గౌస్ బాషా, టోర్నీ కమిటీ సభ్యులు అనిల్ కుమార్, శౌరి కుమార్, మునిరాజ్ పాల్గొన్నారు.


