ప్రజా ఫిర్యాదులపై బాధ్యతగా స్పందించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజా ఫిర్యాదులపై బాధ్యతగా స్పందించాలి

Jul 7 2026 12:39 AM | Updated on Jul 7 2026 12:39 AM

కలెక్టర్‌ డాక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి

కడప సెవెన్‌రోడ్స్‌ : ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా అందిన ఫిర్యాదులపై బాధ్యతాయుతంగా స్పందిస్తూ అర్జీదారులకు సంతృప్త స్థాయిలో నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని కలెక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీల స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అర్జీల పరిష్కారంలో అధికారులు అలసత్వం వీడి శ్రద్ధ పెట్టి పనిచేయాలని, అర్జీలకు అర్జీ నాణ్యమైన పరిష్కారం అందించాలనన్నారు.

● సకాలంలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించాలని ఆర్‌ఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షులు సి.వంశీ కోరారు. జిల్లాలోని కార్పొరేట్‌, ప్రైవేటు పాఠశాలల ఫీజల దోపిడీపై చర్యలు తీసుకోవాలన్నారు.

● ఏళ్ల తరబడి ప్రొద్దుటూరులో ఎంఈఓగా విధులు నిర్వర్తిస్తున్న సావిత్రమ్మను బదిలీ చేయాలని డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వీరనాల శివకుమార్‌ కోరారు. ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యా సంస్థలకు ఆమె వత్తాసు పలుకుతోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సిఇఓ సుబ్రమణ్యం, ఇంచార్జి డీపీవో వెంకటసుబ్బయ్య, డిఆర్డిఏ పిడి జి.రాజ్యలక్ష్మి, డీఎస్‌ఓ రఘురాం, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

‘సర్‌’లో భాగస్వాములు కావాలి

భారత ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (సర్‌) కార్యక్రమంలో అందరూ భాగస్వాములుకావాలని కలెక్టర్‌ డాక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి ఒక ప్రకటనలో తెలిపారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు చురుకుగా పాల్గొని ఓటరు జాబితాను మరింత ఖచ్చితంగా రూపొందించేందుకు సహకరించాలన్నారు. ఇప్పటికే ఎన్యుమరేషన్‌ ఫారం (ఈఎఫ్‌) పూరించిన వారు ఆలస్యం చేయకుండా తమ ఆర్‌పీ/యానిమేటర్‌ ద్వారా లేదా నేరుగా బూత్‌ స్థాయి అధికారి (బీఎల్‌ఓ)కి అందజేయాలని సూచించారు. ఫారం సమర్పించని పక్షంలో డ్రాఫ్ట్‌ ఓటరు జాబితాలో పేరు నమోదుకాకపోయే అవకాశం ఉంటుందని తెలిపారు. 2002లో కుటుంబ సభ్యులు ఓటరుగా నమోదై ఉంటే వారి వివరాలు అందుబాటులో ఉంచాలని తెలిపారు. 2002 నాటి ఓటరు వివరాలు తెలియకపోయినా, అప్పట్లో ఓటు వేసిన గ్రామం లేదా పట్టణం పేరు తెలిస్తే బీఎల్‌ఓ సహకారం అందిస్తారని పేర్కొన్నారు. ప్రతి అర్హత కలిగిన పౌరుడు ఈ కార్యక్రమంలో భాగస్వామి కావడం ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని, అందరూ బాధ్యతగా సహకరించాలని కలెక్టర్‌ కోరారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement