ఆమె కళ్లు సజీవం | - | Sakshi
Sakshi News home page

ఆమె కళ్లు సజీవం

Jul 7 2026 12:39 AM | Updated on Jul 7 2026 12:39 AM

ఆమె కళ్లు సజీవం

సింహాద్రిపురం: ఆమె గుండె ఆగినా.. నలుగురు చూసే లోకాన్ని మరో ఇద్దరి కళ్ల ద్వారా చూడాలని ఆ కుటుంబం భావించింది. భార్య అకాల మరణంతో ఆ ఇల్లాలు లేని లోటు ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపినా.. ఆ దుఃఖంలోనూ మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఆ భర్త తీసుకున్న నిర్ణయం ప్రతి ఒక్కరినీ కదిలించింది. మండల కేంద్రమైన సింహాద్రిపురానికి చెందిన రాగిపిండి వీరనారాయణమ్మ సోమవారం అకస్మాత్తుగా గుండెపోటుకు గురై కన్నుమూశారు. భార్య హఠాన్మరణంతో ఆమె భర్త మురళీరెడ్డితో పాటు కుటుంబ సభ్యులంతా కన్నీరుమున్నీరయ్యారు. అంతటి ఘోరమైన శోకంలోనూ మురళీరెడ్డి మానవీయతను చాటుకున్నారు. తన భార్య భౌతికంగా దూరమైనా, ఆమె నేత్రాలు ఇద్దరు అంధుల జీవితాల్లో వెలుగులు నింపాలని భావించారు. తక్షణమే ఆమె కళ్లను దానం చేయాలని సంకల్పించి, కడపలోని ఎల్వీ ప్రసాద్‌ నేత్రాలయానికి సమాచారం అందించారు.భర్త ఆశయానికి గౌరవమిస్తూ ఎల్వీ ప్రసాద్‌ నేత్రాలయ వైద్య సిబ్బంది తక్షణమే సింహాద్రిపురానికి చేరుకున్నారు. మృతురాలు వీరనారాయణమ్మ పార్థివ దేహం నుంచి అత్యంత పవిత్రంగా కార్నియాలను (నేత్రాలను) సేకరించి భద్రపరిచారు. తమ కళ్లముందే ప్రాణం విడిచిన భార్య నేత్రాలను దానం చేసి, సమాజానికి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చిన భర్త మురళీరెడ్డి ఉదాత్తమైన హృదయాన్ని స్థానిక ప్రజలు అభినందించారు. వీరనారాయణమ్మకు ఘన నివాళులర్పించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement