ఒంటిమిట్ట : ఒంటిమిట్టలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇమాంవలీ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు...రాజంపేట నుంచి కడప వైపు వెళుతున్న బైక్‌ను కడప నుంచి రాజంపేట వెళుతున్న కారు ఢీ కొట్టడంతో రాజంపేట కు చెందిన బైక్‌లోని ఇమాంవలీ, శ్రీరాములకు గాయపడ్డారు. వీరిని 108 లో కడప రిమ్స్ కు తరలించారు. ఇమాంవలీ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తమిళనాడులోని వేలూరు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇమాంవలీ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.
డిప్యూటీ తహసీల్దార్‌పై
సస్పెన్షన్ వేటు
ముద్దనూరు : స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దారుగా విధులు నిర్వర్తిస్తున్న వరదకిషోర్‌రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈమేరకు సోమవారం ఉత్తర్వులు వెలువడ్డాయి.జూన్ 18న కడపలో కూటమి ఆధ్వర్యంలో బాబు పాలనకు రెండేళ్ల కార్యక్రమం నిర్వహించారు.ఈ సభలో మండలంలోని కాండ్లోపల్లె గ్రామానికి చెందిన సతీష్‌రెడ్డి అనే యువకుడు వీఆర్‌ఏ ఉద్యోగం ఇప్పిస్తామని కూటమి నాయకులు తనను మోసం చేసారని ఆరోపిస్తూ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్‌ఏ పోస్టుకు రూ.4 లక్షల 50వేలు వసూలుచేసినట్లు ఆరోపణలు వచ్చాయి.ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఆదేశాల మేరకు ఆర్డీవో శిరీష ముద్దనూరులో విచారణచేపట్టారు.విచారణ అనంతరం స్థానిక డిప్యూటీ తహసీల్దారు వరదకిషోర్‌రెడ్డిని సస్పెండ్‌చే స్తూ కలెక్టర్‌నుంచి ఉత్తర్వులు వెలువడినట్లు తహసీల్దారు అలీఖాన్ తెలిపారు.మండలంలో ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో ఐదుగురిని వీఆర్‌ఏ పోస్టుల్లో నియమించినట్లు,వీరి వద్దనుంచి డబ్బులు వసూలుచేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.
బాధ్యతల స్వీకరణ
కడప రూరల్ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో సోమవారం ఆఫీసు సూపరిండెంట్‌గా నాగేంద్ర, చంద్రహాసుడు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రవిబాబును మర్యాదపూర్వకంగా కలిశారు.
రాజంపేట ఏఎస్పీ
మనోజ్ రామ్‌నాథ్ హెగ్డే బదిలీ
రాజంపేట : రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామ్‌నాథ్ హెగ్డే సోమవారం బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పదోన్నతిపై విజయవాడ లా అండ్ ఆర్డర్ అడ్మిన్‌గా బదిలీ అయ్యారు. 2025లో జనవరిలో రాజంపేట ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి పలు కేసులను చేధించారు.
బైక్ ఢీకొని మహిళ దుర్మరణం
కలికిరి : రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన ఘటన సోమవారం మండల పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు.. మండలంలోని టి.సండ్రావారిపల్లికి చెందిన ఇందాదుల్లా భార్య వహీదా(53) టి.సండ్రావారిపల్లి వద్ద పీలేరు–చిత్తూరు జాతీయ రహదారిలో రోడ్డు దాటుతోంది. పీలేరు వైపు నుంచి వేగంగా వచ్చిన ఓ ద్విచక్రవాహనం ఆమెను ఢీకొని వెళ్లింది. ఈ ప్రమాదంలో వహీదా తలకు తీవ్ర రక్తగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108 వాహనంలో పీలేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ మేరకు కలికిరి పోలీసులు కేసు నమోదు చేశారు.
మద్యం విక్రేత అరెస్ట్
గుర్రంకొండ : ప్రభుత్వ పాఠశాల వద్ద మద్యం విక్రయిస్తున్న బెల్టుషాపు నిర్వాహకుడిని పోలీసులు అరెస్ట్ చేసిన సంఘటన మండలంలోని మర్రిపాడులో జరిగింది. స్థానిక జెడ్పీహైస్కూల్ పరిసరాల్లోని ఓ చిల్లర దుకాణంలో గత కొంతకాలంగా బెల్టుషాపు నిర్వహిస్తున్నారు. ఈవిషయమై గ్రామస్తుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ రవీంద్రబాబు దాడులు నిర్వహించారు. ఈదాడులో దుకాణంలో అమ్మకానికి సిద్ధంగా ఉంచిన పది మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. బెల్టుషాపు నిర్వాహకుడు ఖాదరవలీపై కేసు నమోదు చేశామన్నారు.


