జమ్మలమడుగు : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంధిస్తున్న సూటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్దేశపూర్వకంగానే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ జమ్మలమడుగు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్, ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. మీరు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల్లో వస్తున్న తీవ్ర వ్యతిరేకతను తట్టుకోలేకనే ప్రతిసారీ వివేకానందరెడ్డి కేసును తెరపైకి తెస్తున్నారని ధ్వజమెత్తారు.
సీబీఐ మీ చేతుల్లోనే ఉన్నా
నిరూపించలేరెందుకు?
‘కేంద్రంలో మీ సపోర్టుతోనే మోదీ ప్రభుత్వం నడుస్తోంది. సీబీఐ అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ. అంతటి పెద్ద దర్యాప్తు సంస్థ కూడా ఈ కేసులో అవినాష్‌రెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డిల ప్రమేయం ఉందని ఎక్కడా చెప్పలేదు. అయినా నీవు కుక్కలాగా అరుస్తున్నావు ఆదీ! ఈ కేసు గురించి ఇంకా ఎన్ని సంవత్సరాలు మాట్లాడి రాజకీయం చేస్తారు? నీకు కనీస సిగ్గు ఉండాలి‘ అంటూ ఎమ్మెల్సీ అత్యంత ఘాటుగా ధ్వజమెత్తారు. గతంలో వైఎస్సార్‌సీపీ సింబల్ మీద గెలిచి, ఆ తర్వాత స్వార్థం కోసం టీడీపీలోనికి జంప్ అయిన చరిత్ర ఆదినారాయణరెడ్డిది అని రామసుబ్బారెడ్డి గుర్తు చేశారు. వైఎస్సార్‌సీపీ తరఫున ఎమ్మెల్సీగా నిలబడిన వైఎస్ వివేకానందరెడ్డిని ఓడగొడితే.. జిల్లాలో వైఎస్ కుటుంబాన్ని దెబ్బతీయవచ్చని చంద్రబాబు నాయుడు వద్ద ప్లాన్ చెప్పి, ఇక్కడి ఎంపీటీసీలను, కౌన్సిలర్లను బెదిరించి, బలవంతంగా ఓట్లు వేయించి వివేకానందరెడ్డిని ఓడించిన ద్రోహివి నీవని, అలాంటి నీకు వైఎస్ కుటుంబంపై మాట్లాడే అర్హత లేదన్నారు.
రాజకీయాల నుంచి తప్పుకుంటా..
భూపేష్‌రెడ్డికి సవాల్!
టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్‌రెడ్డి తమపై చేసిన దారుణమైన ఆరోపణలను ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి తీవ్రంగా ఖండించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినప్పుడు, రామసుబ్బారెడ్డి తమ గ్రామంలో డిన్నర్లు (విందులు) చేసుకున్నారంటూ భూపేష్‌రెడ్డి అత్యంత దారుణమైన అసత్య ఆరోపణలు చేశారని మండిపడ్డారు. ‘భూపేష్‌రెడ్డీ.. చేసిన ఆరోపణ నిజమని నీవు నిరూపిస్తే నేను తక్షణమే నా రాజకీయాల నుంచే శాశ్వతంగా తప్పుకుంటాను, మరి నిరూపించలేకపోతే నీవు రాజీనామా చేస్తావా?‘ అంటూ ఎమ్మెల్సీ బహిరంగ సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఈసీ సభ్యుడు గిరిధర్‌రెడ్డి, గోవిందు, బోనం సురేష్, రాఘవేంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వివేకాను ఓడించిన ద్రోహి
ఆదినారాయణరెడ్డి
వైఎస్ కుటుంబంపై మాట్లాడే అర్హత లేదు
వైఎస్సార్ మరణంపై అసత్యాలు
చెప్తే ఊరుకోం
నిజం నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమంటూ భూపేష్‌రెడ్డికి సవాల్!
ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి


