చర్చి స్థలం ఆక్రమణపై చర్యలు తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

చర్చి స్థలం ఆక్రమణపై చర్యలు తీసుకోవాలి

Jul 7 2026 12:39 AM | Updated on Jul 7 2026 12:39 AM

చాపాడు : మండలంలోని శ్రీరాములపేటలో ఉన్న చర్చి స్థలం ఆక్రమణపై చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్‌ మండల అధ్యక్షుడు రమేష్‌ పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక మండల రెవెన్యూ కార్యాలయం వద్ద సోమవారం దళితులు ఆందోళన నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌ రమాకుమారికి వినతి పత్రం అందజేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఆక్రమణదారులపై చర్యలు తీసుకుని, ప్రభుత్వ స్థలాలను కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీరాములపేట దళితులు పాల్గొన్నారు.

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

మైదుకూరు : పట్టణంలోని బద్వేలు రోడ్డులో సోమవారం గుర్తు తెలియని వాహనం ఢీకొని మండలంలోని సుంకులుగారిపల్లెకు చెందిన అంబటి శివశంకర్‌రెడ్డి (38) అనే వ్యక్తి మృతి చెందాడు. ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్న శివశంకర్‌రెడ్డి మైదుకూరుకు వ్యక్తిగత పనిపై వచ్చి తిరిగి బైక్‌పై గ్రామానికి వెళుతుండగా బద్వేలు రోడ్డులోని టీటీడీ కల్యాణ మండపం సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొంది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో 108 అంబులెన్స్‌ సిబ్బంది అతన్ని చికిత్స కోసం ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తీసుకెళుతుండగా మార్గమధ్యలో ఆయన మృతి చెందాడు. శివశంకర్‌రెడ్డికి భార్య శ్రీలత, 9, 6వ తరగతి చదువుతున్న ఇద్దరు కుమార్తెలు, ఒకటో తరగతి చదువుతున్న ఓ కుమారుడు ఉన్నారు.

ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య

పీలేరు రూరల్‌ : ఉరివేసుకుని వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన పీలేరు పట్టణం ఇందిరా నగర్‌లో చోటుచేసుకుంది. ఎస్‌ఐ లోకేష్‌ కథనం మేరకు వివరాలిలా వున్నాయి. ఇందిరానగర్‌లో కాపురం ఉంటున్న సురేష్‌ ఆచారికి సుగుణ(30)తో తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఏమి జరిగిందో తెలియదు కానీ సోమవారం రాత్రి ఇంటిలో తలుపు వేసుకుని ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. ఎంతకూ తలుపు తీయకపోవడంతో అత్త నీలంబరి కిటికీలోంచి చూసింది. సుగుణ ఉరివేసుకుని వేలాడుతుండగా గమనించి కేకలు వేసింది. దీంతో ఇరుగు పొరుగు వారు వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా అప్పటికే సుగుణ మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

రైతును కాటేసిన పాము

వాల్మీకిపురం : గుర్రంకొండ మండలం టి.రాచపల్లి పంచాయతీ దిగువబురుజుపల్లిలో ఓ రైతును పాము కాటేసిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. వివరాలు.. టి.రాచపల్లికి చెందిన రైతు రమణారెడ్డి (59) సోమవారం తన పొలం వద్ద వ్యవసాయ పనులు చేస్తుండగా నాగుపాము కాటేసింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బాధితుడిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం మదనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement