మైదుకూరు : పట్టణంలోని బద్వేలు రోడ్డుకు చెందిన 23 ఏళ్ల యువతి కనిపించడం లేదని యువతి తల్లి నాగసుబ్బమ్మ సోమవారం మైదుకూరు అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆరు నెలల కిందట డిగ్రీ పూర్తి చేసి ఇంటి వద్దనే ఉంటున్న తన కుమార్తె ఆదివారం ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగి రాలేదని తల్లి ఫిర్యాదులో పేర్కొన్నారు.
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
లింగాల : లింగాల మండలం పార్నపల్లె గ్రామంలో విద్యుదాఘాతానికి గురై యామవరం మధు (48) అనే వ్యక్తి మంగళవారం సాయంత్రం మృతి చెందాడు. ఈయన గత 20ఏళ్లుగా పార్నపల్లె గ్రామానికి చెందిన గొర్తి రాఘవయ్య పొలంలో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సాయంత్రం 4.30 ప్రాంతంలో పొలంలో పనులు చేస్తుండగా కరెంట్ వచ్చిన వెంటనే మోటార్ ఆన్ చేయడానికి స్టార్టర్ వద్దకు వెళ్లాడు. స్టార్టర్‌ను తాకగానే విద్యుత్ సరఫరా అయ్యి అపస్మారక స్థితిలో పడిపోయాడు. వెంటనే అక్కడ ఉన్న రాఘవయ్య, స్థానికులు 108 వాహనం ద్వారా పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్ పరీక్షించి మధు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ జగదీశ్వరరెడ్డి తెలిపారు.
ఎరువుల దుకాణాల తనిఖీ
రాజంపేట రూరల్ : పట్టణంలోని పలు విత్తన, ఎరువుల దుకాణాలను రాజంపేట ఏడీఏ ప్రజాపతి మల్లికార్జునతో కలిసి జిల్లా సహాయ వ్యవసాయ సంచాలకులు (ఏడీఏ) మస్జీద్ అహమ్మద్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల దుకాణాల్లో రికార్డులను పరిశీలించారు. పలు దుకాణాల్లో ఫారం ఓలో సమయం మించిపోవటం వల్ల రూ.33, 12,881 లక్షల విలువ గల ఎరువుల అమ్మకాలను నిలుపుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డీలర్లు తమ అమ్మకాల వివరాలను ఏపీఏఐఎంఎస్ అప్లికేషన్‌లో డీలర్ తప్పనిసరిగా పొందుపరచాలని తెలిపారు. డీబీటీ, స్టాక్ రిజిస్టర్, గ్రౌండ్ బ్యాలెన్స్ ప్రతి రోజు ట్యాలీ చేసుకోవాలని సూచించారు. ప్రతి రైతుకు కొనుగోలుకు సంబంధించి రసీదును ఇవ్వాలని ఆదేశించారు. ఈ తనిఖీలలో ఎంఏఓ జీ.నాగలక్ష్మీ, ఏఈఓ సురేష్, బీటీఎం సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.


