జమ్మలమడుగు: మండల పరిధిలోని ముద్దనూరు వైపు ఉన్న కొండ ప్రాంతంలో విచ్చలవిడిగా గ్రావెల్‌ను తవ్వేస్తున్నారు. పెన్నానదిలో నుంచి ట్రాక్టర్, టిప్పర్‌ల ద్వారా భారీగా తరలిస్తున్నారు. డివిజన్ స్థాయి అధికారి ఉన్నా వాటి గురించి ఏమాత్రం పట్టించుకోవడంలేదు. ఇప్పటికే కొండ ప్రాంతాన్ని అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. ఇసుక, గ్రావెల్ అక్రమ తరలింపును ఆరికట్టేవారెవరు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జిల్లా కలెక్టర్ సైతం పెన్నానది నుంచి ఇసుక తరలింపును నిషేధించారు. అయినా ఫలితం లేదు.
రెచ్చిపోతున్న మందుబాబులు
పులివెందుల రూరల్ : పులివెందుల పట్టణంలోని పలు ప్రాంతాల్లో మందు బాబులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. రెండు రోజులు క్రితం పులివెందుల అర్బన్, రూరల్ పోలీస్ స్టేషన్లలో పోలీసుల వాహనాల అద్దాలను పగులగొట్టారు. ఆదివారం పట్టణంలోని వెంకటేశ్వర స్వామి గుడి సమీపంలో మద్యం మత్తులో రోడ్డుపై అడ్డంగా పడుకొని వికృత చేష్టలు చేయడంతో ట్రాఫిక్ అంతరాయం కలిగింది. పక్కనే ఉన్న హోంగార్డు నాయక్ జోక్యం చేసుకుని మత్తులో ఉన్న వ్యక్తిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
వేధింపులు తాళలేక
మహిళ ఆత్మహత్య
బి.కోడూరు : మండలంలోని ఐత్రంపేట గ్రామానికి చెందిన సిద్దుఅనూష (24) ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఐత్రంపేట గ్రామానికి చెందిన సిద్దురామసుబ్బారెడ్డి, నారాయణమ్మలకు కుమార్తె అనూషకు ఒంటిమిట్ట గ్రామానికి చెందిన టి.సాయినాఽథ్‌రెడ్డితో ఆరు నెలల క్రితం వివాహమైంది. అప్పటినుంచి వరకట్నం కోసం అత్త, మామ, భర్త అనూషను వేధిస్తుండేవారని, మనస్తాపం చెంది రెండు నెలల క్రితం ఐత్రంపేటకు వచ్చింది. ఆదివారం మనోవేదనకు గురై జీవితం మీద విరక్తితో ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది. గమనించిన చుట్టుపక్కల వారు తల్లి నారాయణమ్మ, తమ్ముడు శ్రీనాఽథ్‌లకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు వచ్చి చూసేసరికి అనూష అపస్మారకస్థితిలో పడి ఉంది. వెంటనే ద్విచక్ర వాహనంపై పోరుమామిళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు బి.కోడూరు ఎస్‌ఐ సూర్యనారాయణరెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తొగటవీర క్షత్రియ సంఘం జిల్లా కమిటీ ప్రమాణ స్వీకారం
ప్రొద్దుటూరు కల్చరల్: తొగటవీర క్షత్రియులు రాజకీయంగా, సామాజికంగా ఎదగడానికి అంతా ఐకమత్యంతో ముందుకు సాగాలని కదిరి నియోజకవర్గ శాసనసభ్యుడు కందికుంట వెంకట ప్రసాద్ పిలుపునిచ్చారు. స్థానిక శ్రీ తొగటవీర క్షత్రియ కల్యాణ మండపంలో ఆదివారం తొగటవీర క్షత్రియ సంఘం జిల్లా నూతన కార్యవర్గ కమిటీ ప్రమాణ స్వీకార ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మోడెం వీరాంజనేయప్రసాద్ సమక్షంలో జిల్లా అధ్యక్షుడిగా బండారు సూర్యనారాయణ, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా చౌడం జొల్లు కొండయ్య, ప్రధాన కార్యదర్శిగా బొల్లు సోమశేఖర, కోశాధికారిగా పల్లా భాస్కర్, కార్యనిర్వాహక కార్యదర్శిగా రామచంద్రుడు ప్రమాణస్వీకారం చేశారు. నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన జిల్లా అధ్యక్షుడు బండారు సూర్యనారాయణ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన కులబాంధవులందరికీ ధన్యవాదాలు తెలిపారు. జిల్లా అంతటా సంఘాన్ని బలోపేతం చేయడానికి నిరంతరం శ్రమిస్తానని, ప్రతి నియోజకవర్గ, మండల స్థాయిలో త్వరలోనే కమిటీలను ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. పేద కులస్థుల సంక్షేమానికి, నిరుద్యోగ సమస్యల పరిష్కారానికి తన వంతు ఆర్థిక, సామాజిక తోడ్పాటునందిస్తానని స్పష్టం చేశారు. ఈ వేడుకలో అఖిలభారత తొగటవీరక్షత్రియ సంఘం ఉపాధ్యక్షుడు బండారు రఘురామయ్య, సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మిశెట్టి కృష్ణమూర్తి, మహిళా నాయకురాలు జయశ్రీ లతో పాటు వివిధ జిల్లాల అధ్యక్షులు మోందపల్లి బాబు, వెంకటనారాయణ, పురం మల్లయ్య, దాసరి శ్రీరాములు, కొప్పుల సత్యనారాయణ, బండి శ్రీనివాసులతో పాటు భారీ సంఖ్యలో కులబాంధవులు పాల్గొని నూతన కమిటీకి అభినందనలు తెలిపారు.


